03. తెలుగు సాహిత్యంలొ గిరిజనుల ప్రస్తావనలు
ఒక జాతి సంస్కృతిని సాంప్రదాయాలను, కళలను గురించి తెలుసుకోవాలంటే అందుకు సాహిత్యం ప్రధానమైన ఆధారంగా నిలుస్తుంది. తెలుగు సాహిత్యంలో ప్రాచీన కాలం నాటి గిరిజనులను గురించి అనేక ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. తెలుగు కవులు తమ రచనలలో గిరిజనుల ప్రస్తావనలను సందర్భానుసారంగా చేయడం జరిగింది. అందులో ఆయా ప్రాంతాల్లోని గిరిజనుల జీవన విధానాన్ని, రూపురేఖలను, వేషధారణను, స్వభావాలను, సంస్కృతీ విశేషాలను, కళా వైవిధ్యాన్ని చక్కగా వివరించారు.
తెలుగులో మొట్టమొదటి రచన ఆంధ్ర మహాభారతం. దీన్ని నన్నయభట్టు, తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ అనే ముగ్గురు కవులు రచించారు. వీరు క్రమంగా 11వ, 13వ, 14వ శతాబ్దాలకు చెందిన వారు. భారతంలోని ఆయా భాగాల్లో గిరిజనుల ప్రస్తావనలు అనేకం ఉన్నాయి. ఆంధ్ర మహాభారతానికి మూలం సంస్కృతం. అది ద్వాపరయుగం నాటి ఇతిహాసం. కాబట్టి అందులో వచ్చిన గిరిజనుల ప్రస్తావనలు ఆనాటివేనని చెప్పవచ్చు. అంటే ఆనాటికే గిరిజన జాతులవారు అనేకం భారతదేశ మంతటా విస్తరించి ఉన్నారని తెలుస్తుంది.
ఆంధ్ర మహాభారతంలో కవులు శబర, పుళింద, కిరాత, నిషాద, పార్వతేయులు, అరణ్యవాసులు, పర్వతనివాసులు, వనచరులు, బోయలు, వ్యాధులు, పక్షిధ్వంసకులు, పక్షి వైరి, లుబ్ధ మొదలైన పదాలను గిరిజన జాతులను ఉద్దేశించి ప్రయోగించారు.1 ఇందులో ఎరుక, కిరాత, నిషాద, శబర, పుళింద, వ్యాధ, బోయ అనేవి పర్యాయ పదాలు.
2ఆంధ్ర మహాభారతంలో గరుత్మంతుని కథ ఉంది. ఈ కథలో గరుత్మంతుడు మాతృ దాస్య విమోచనం కోసం స్వర్గానికి పోయి అమృతం తీసుకుని రావాలని అనుకున్నాడు. అందుకు అతనికి తగిన బలం కావాలి. కనుక అతడు తన తల్లిని ఆహారం కావాలని అడిగాడు. అప్పుడు వినత సముద్ర గర్భంలో లెక్కలేనంత మంది నిషాదు లున్నారు. వారు భూమి మీద ప్రజలకు కష్టాల్ని కలిగిస్తున్నారు. వారిని బక్షించి వెళ్ళు అని చెప్పింది. ఈ సందర్భాన్ని బట్టి నిషాదులు దుర్మార్గులని తెలుస్తుంది.
3మహాభారతంలో యయాతి చరిత్ర ముఖ్యమైంది. అందులో యయాతి శుక్రాచార్యుని శాపం వల్ల వృద్ధాప్యాన్ని పొందాడు. అయితే అతడు తన వృద్ధాప్యాన్ని తన కొడుకులలో ఎవరికైనా ఇచ్చి సుఖ భోగాలని అనుభవించి తిరిగి తన వృద్ధాప్యాన్ని తాను గ్రహించి తన రాజ్యాన్ని ఆ కుమారునికి ఇవ్వవచ్చు అని శుక్రాచార్యుడు శాప విమోచనాన్ని చెప్పాడు. కానీ అతని కొడుకులు దేవయాని వల్ల కలిగిన వారు ఎవరూ అందుకు అంగీకరించలేదు. అందులో తుర్వసుడనే వాడు వృద్ధాప్యాన్ని అసహ్యించుకున్నాడు. అందుకు యయాతి కోపించి తుర్వసువంశం వారు ధర్మాధర్మ వివేకశూన్యులై సంకీర్ణ జాతులైన కిరాతరాజులుగా మారుతారని శపించాడు. అంటే ఆటవికులుగా ఉండే కిరాతులు ధర్మాధర్మ విచక్షణ లేనివారు గాను, సంకరజాతివారుగాను ఈ సందర్భంలో పేర్కొనబడినారు.
11