Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'బమ్మెర గ్రామంలోను బృహత్ శిలాయుగ సంస్కృతి కనిపిస్తుంది. ఈగ్రామం దగ్గరలో నరసింహ బావి అని ఒక బావి ఉంది. ఈ బావికీ వీరభద్ర ఆలయానికీ మల్లన్న గుడికీ మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో వీరుల స్మారక చిహ్నాలు (మెన్షిర్ లు) ఉన్నాయి. అవి సుమారు రెండు అడుగుల వెడల్పు పది అడుగుల పొడవు ఉన్న బృహత్ శిలాయుగపు శిలలు. ఆదిమానవుల నివాస స్థలంగా కనిపించే ఒక గుహను కలుపుకొని ఆ నరసింహ బావిని నిర్మించారు. ఆ గుహలో నివసించే ప్రజలు తమ ఆరాధ్య దేవతల బొమ్మలను చిత్రించుకున్నారని పక్క గ్రామమైన గూడూరులో దొరికిన క్రీస్తు శకం 1124 నాటి శాసనాన్ని బట్టి తెలుస్తుంది. విరియాల మల్లుడు అక్కడ మల్లేశ్వరాలయాన్ని కట్టించి దాని నిర్వహణ కోసం బొమ్మరిగె అనే గ్రామాన్ని దానం చేశాడని ఆ శిలాశాసనంలో వ్రాసి ఉంది. ఆనాటి బొమ్మరిగె పోతన కాలం నాటికి బమ్మెర అయింది. బొమ్మరిగె లేదా బొమ్మర పదాల్లో వినిపిస్తున్న 'బొమ్మ, శబ్దం 'మెన్హీర్'ల కాలం నాటి మానవులు ఈ నరసింహ స్వామి బావి దగ్గర ఉన్న గుహలో సుమారు రెండున్నర వేల ఏళ్ళ క్రితం చిత్రించిన బొమ్మల ఉనికిని సూచిస్తున్నాయి. వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు బమ్మెర గుహల్లో నివాసం ఉండే వారనే దాన్నిబట్టి ఆ గుహ ఆదివాసుల స్థావరంగా ఉండేదని భావించవచ్చు.

కరీంనగర్ జిల్లాలో ప్రవహించే గోదావరికి ఉపనది అయిన మానేరులో కలిసే వాగు వీణవంక వాగు. దీనికి సమీపంలో నెలకొన్న గ్రామం వీణవంక అనేది. ఈ గ్రామం దగ్గర కల్వలగుట్ట గుహలో మూడు వేల సంవత్సరాల నాటి చిత్రలేఖనా లను చరిత్రకారులు గుర్తించారు. అవి నవీన శిలా యుగానికి చెందినవిగా భావించారు. నవీన శిలాయుగంలో ఆది మానవులు గుహల్లో నుండి నీటి వనరు ఉన్న మైదాన ప్రాంతాలకు వచ్చి స్థిరనివాసం ఏర్పరుచుకోవడం జరిగింది. అప్పటి మనుషులు వేటాడిన జంతువుల చిత్రాలు ప్రధానంగా ఇక్కడ చిత్రించబడినాయి. వాటిలో కొన్నింటిని ఠాగూర్ రాజారాం సింగ్ గారు సేకరించారు.

"గోదావరి ఉపనదైన కడెంనది పరిసరాల్లో సుమారు ఐదు లక్షల సంవత్సరాల నుండి ఈనాటి వరకు ఆదిమానవులు గిరిజనులు నివసిస్తున్నారని పురావస్తు ఆధారాలు తెలుపుతున్నాయి. గోదావరీనది ఘనాపూర్, పొచ్చెర, కనకాయి, కుంటాల దగ్గర జలపాతాలుగా దూకుతుంది. వీటి పరిసరాల్లో తొలి పాతరాతి యుగం నుండి మానవులు జీవనం సాగించినట్లు తెలుస్తుంది. అక్కడ పాతరాతి ఆయుధాలు, పనిముట్లు మొదలైన ఆనవాళ్ళు దొరికాయి. మధ్యపాతరాతి యుగానికి చెందిన మనుషులు ఇక్కడ ఒకటిన్నర మీటర్ వ్యాసంతో గుండ్రటి గద్దెలను, రెండు మీటర్లు - ఒకటిన్నర మీటర్ల కొలతలతో దీర్ఘ చతురస్రాకార గద్దెలను కట్టుకున్నారు. వారు నిద్రించడానికి, వేటాడిన జంతు మాంసాన్ని తినడానికి యోగ్యంగా చేసుకోవడానికి వాటిని ఉపయోగించుకొని ఉంటారని చరిత్రకారులు ఊహించారు. మధ్య రాతి యుగానికి పరిణమించిన దశను తెలిపే చెకుముకిరాయి, రాగి రంగు రాతి ఆయుధాలు లభించాయి. రాతియుగం తర్వాత ఇనుప పనిముట్లు వాడడం కూడా పోచంపాడు తవ్వకాల్లో కనిపించాయి. ఇక్కడ బృహత్ శిలా యుగ లక్షణాలు కనిపిస్తాయి. పెద్దపెద్ద బండరాళ్లతో సమాధులు కట్టారు. ఆ సమాధుల్లో మనిషి అస్థికలతో పాటు జంతువుల ఎముకలు, ఇనుప పనిముట్లు కనిపించాయి. ఒక సమాధిలో మధ్య వయసు ఆడ గుర్రాన్ని నరికి దాని తలను ఒక పీట మీద పెట్టారు. ఇందులో గుర్రాన్ని స్వారీ చేసేటప్పుడు కాళ్ళకు పెట్టుకునే ఇనుప కడియం దొరికింది. జంతు బలులు ఈనాటికి ఆదివాసీల్లో కనిపించే ఆచారమే.

ప్రాచీన కాలం నాటి దేవతలను ఇప్పటికీ గిరిజనులు ఆరాధించే విధానం కూడా తెలంగాణలో కనిపిస్తుంది.

“కనకాయి” అని పిలవబడుతున్న బంగారమ్మ తీర్థ క్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో బజార్ హత్నూర్ దగ్గర పారుతున్న గోదావరి, దాని ఉపనది కడెంనది మధ్యలోని ద్వీపం పైన ఉంది. కడెంనది కడియం ఆకారంలో పారేది

8