Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13భోంగా:- భోంగాను సండ్ర, రావి చెట్టు కర్రలతో తయారుచేస్తారు. కట్టెను గొట్టం మాదిరిగా చెక్కు తారు. దీనికి గిన్నె లాంటి దాన్ని ఒక చివర అమరుస్తారు. దీన్ని 'వాటి' అంటారు. భోంగా చుట్టూ సన్నని తాడును కడతారు. రెండవ చివర 'సల్లి'ని అమర్చుతారు. ఇది సన్నాయికి శృతి వాద్యంగా పనిచేస్తుంది.

14సన్నాయి:- సన్నాయిని సండ్ర, రావి కట్టెలతో తయారు చేస్తారు. ఇది పద్దెనిమిది అంగుళాల పొడవు ఉంటుంది. కట్టెను గొట్టం లాగా తొలుస్తారు. దీనికి ఆరు రంధ్రాలు చేస్తారు. దీనికి గిన్నె లాంటి వాటి) దాన్ని ఒక చివర అమరుస్తారు. రెండవ చివర ఊదే వైపు ఇత్తడితో చేసిన మూతను వాడుతారు. దానిపై భాగాన పీకను (సల్లిని) పెడతారు. దీన్ని తాటి ఆకులతో చేసి పెడతారు. సన్నాయి గొట్టానికి అల్యూమినియం గొలుసులు అలంకరిస్తారు. దీన్ని పద్దెనిమిది రకాల రాగాలతో వాయిస్తారు.

గిరిజనులు తమ జీవనానికి, మనోల్లాసానికి అవసరమైన వాటినన్నిటిని అడవి నుండి సేకరించుకుంటారు. అలాగే సంగీత నృత్యాలు వారి జీవనంలో ముఖ్యమైనవి కాబట్టి వాటికి అవసరమైన వాద్యాలను కూడా అడవిలో దొరికే వస్తువులతోనే తయారు చేసుకుంటారు. వేట గిరిజనులు ప్రధాన జీవనాధారం అయినందువల్ల వేటాడిన జంతు చర్మాలతో కొన్ని చర్మవాద్యాలను, జంతువుల కొమ్ముల నుండి కొన్ని సుషిర వాద్యాలను తయారు చేసుకున్నారు. అలాగే ఆ జంతువుల నరాలను తీగలుగా తయారు చేసుకుని తంత్రీ వాద్యాలను తయారు చేసుకున్నారు. కొన్ని చెట్ల కాయలు ఎండిన తర్వాత వాటి ధ్వనిని విని వాటితో తాళవాద్యాలను తయారు చేసుకున్నారు. ఇవన్నీ వారి పరిశీలనాశక్తికి, ఆలోచన విధానానికి నిర్మాణ పరిజ్ఞానానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

174