Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రధాన్ లు చనిపోయిన వారి ఆత్మలను కూడా పూజిస్తూ పాటలు పాడతారు.

10“నిమ్మె సాసికుం పేన్దతర్స్,
మన్ మాక్ పాస్ టిమన్
సాసి పేన్ అతి,మారుబాయి, పేన్దతర్సో
మన్ మాక్ పాస్ టీమన్”

'మీరు ఇప్పుడు పూర్వీకులతో ఉండండి. దేవునితో ఉండండి. మాకు అనుకూలంగా ఉండండి. చనిపోయి మీరు దేవునిగా మారారు. ఓ మారుబాయి దేవునితో ఉండు. మాకు అనుకూలంగా ఉండు' అని ఇలా చనిపోయిన వారి ఆత్మలను కూడా తమ ప్రార్ధనతో ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రధాన్ లు పాటలు పాడుతారు.

ఈ విధంగా ప్రధాన్ ల పాటలన్నీ గోండు సంస్కృతితో ముడిపడి ఉంటాయి. వీరి పాటలు వల్ల గోండులకు ప్రధాన్ లు ముఖ్యులుగాను, అన్ని కార్యాల్లోనూ సహాయకులుగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఆదివాసీల పాటలలో పల్లవి, కొన్ని చరణాలు, పదాలు పదేపదే పునరావృతం అవుతూ చక్కని ధ్వని సౌందర్యాన్ని కలిగించి శ్రోతలకు వినసొంపైన ఆనందాన్ని కలిగిస్తాయి. వారి పాటలలోని భావాలు సాధారణంగా ఉన్నట్లు అనిపించినా వాటి ఉద్దేశం స్పష్టంగా అర్థమవుతుంది. భక్తి భావంగాని, ఆనందంగాని, వివాహం, శిశు జననం మొదలైన సామాజిక అంశాలుగానీ వ్యక్తం చేయడంలో గిరిజనుల పాటలు ఎంతో భావయుక్తంగా కనిపిస్తాయి.

ప్రధాన్ ల సంగీత వాద్యాలు

ప్రధాన్ లు కిక్రి, సన్నాయి (సుర్నేయి), భోంగా, డోలు, కాలికోమ్, తుడుం, డోల్కి, గాగ్రే, తబల, జతూర్ అనే వాద్యాలను ఉపయోగిస్తారు. వీటిలో కిక్రి, డోల్కి (డోలు), కాలికోమ్, తుడుం అనే వాద్యాలను గోండులు కూడా ఉపయోగిస్తారు. కిక్రీ, డోలు, భోంగా, కాలికోమ్ అనే వాద్యాలను తోటీలు కూడా వాయిస్తారు. ప్రత్యేకించి ప్రధాన్ లు వాయించే వాద్యాలు జతూర్, ఖుజ్జ, భోంగా, సన్నాయి అనేవి.

11జతూర్:- జతూర్ అనే వాద్యం కిన్నెర వలనే ఉండే వాద్యం. దీనికి మెట్లపై రెండు తీగలు, క్రింద మూడు సొరకాయ బుర్రలు ఉంటాయి. కిన్నెరలో మధ్యలో సొరకాయ బుర్ర పెద్దదిగాను, అటు ఇటు ఉన్న సొరకాయ బుర్రలు చిన్నవిగాను ఉంటాయి. జతూర్ కు మూడు సొరకాయ బుర్రలు ఒకే పరిమాణంలో ఉంటాయి. కిన్నెర వాద్యం తీగలను చేతితో మీటుతూ వాయిస్తారు. కానీ జతూర్ తీగలను విల్లులాంటి దానితో మీటుతారు. చూడడానికి కిన్నెర జతూర్ రెండూ ఒకే విధంగా కనిపించినా వాటిని మీటే విధానంలో భేదం ఉంటుంది.

12బుజ్జ:- ఖుజ్జను అడవులలో దొరికే అడవి బర్రెల కొమ్ములతో తయారుచేస్తారు. ఇది కొడవలి ఆకారంలో ఉంటుంది. దీని చివరి నుండి పట్టుకునే వైపు వరకు అరవై గుర్రంతోక వెంట్రుకలను కడతారు. ఖుజ్జ పైన ముప్పైరెండు గజ్జెలు కడతారు. ప్రధాన్ తెగ వారు తమ సగాలకు చెందిన సంఖ్య ప్రకారం పెద్ద గజ్జెలు కూడా కడతారు. అంటే నాలుగవ సగా అయితే నాలుగు ఐదవ సగా అయితే ఐదు ఈ విధంగా సగా లెక్కని బట్టి పెద్ద గజ్జలు కడతారు. ఖుజ్జ ద్వారా కిక్రి వాద్యం తీగలను మీటుతారు.

173