ప్రధాన్ ల దింసా నృత్యం
ప్రధాన్ లు వివాహ వేడుక, పండుగ ఉత్సవాల సందర్భంలో దింసా నృత్యాన్ని ప్రదర్శిస్తారు. సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు ధరించి స్త్రీలు పురుషులు ఈ నృత్యంలో పాల్గొంటారు. చేతులు ఊపుతూ గుండ్రంగా తిరుగుతూ ఒక అడుగు ప్రక్కలకు ఒక అడుగు ముందుకు వేస్తూ చేసే ఈ నృత్యం ప్రధాన్ ల దింసా ప్రత్యేకత. అతి సాధారణంగా ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కు వేస్తూ చేసే దింసానృత్యం గిరిజనులందరికి ఇష్టమైనది.
గిరిజన నృత్యాలలో ప్రధానమైన ఆకర్షణ నెమలి ఈకలు. వారి నృత్యాలు అన్నీ బృందం నృత్యాలుగా ఉండడంతో వారి ఐకమత్యం ప్రస్ఫుటమవుతుంది. గిరిజనులకు మత విశ్వాసం ఎక్కువ. మానవతీత శక్తుల మీద నమ్మకం అధికం. ప్రకృతిని దేవతగా పూజించడం వారికి ముఖ్యం. ప్రకృతిలోని కొండలు, వాగులు, చెట్లు, రాళ్లు మొదలైన వాటిని పొలిమేర దేవతలుగా వారు పూజిస్తారు. ఏ పని సక్రమంగా జరగకపోయినా, చెడు జరిగినా ఆయా దేవతలను శాంతింప చేయడానికి వారు పాటలు నృత్యాలు వాద్యాలతో పూజలు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా, వరంగల్ జిల్లాలో సమ్మక్క, శ్రీశైలంలో చెంచు మల్లన్న ఉత్సవాల్లో గిరిజనులు పూజలు చేయడం, ఆటపాటలను ప్రదర్శించడం, వారి కళా నైపుణ్యాలకు, మత విశ్వాసాలకు నిదర్శనం.
170