వివాహం:- ప్రధాన్ లలో వివాహాలు నాలుగు విధాలుగా ఉంటాయి.
- 1. సంప్రదింపుల వివాహం.
- 2. (ధరున్ టాకాచ) బలవంతపు వివాహం.
- 3. (శివార్ గెలి ఘర్ దస్సీ) అమ్మాయికి నచ్చితే అబ్బాయి ఇంటికి వెళ్లిపోవడం.
- 4. (ఘర్ జావాయ్) ఇల్లిరకం వివాహం.
సంప్రదాయ వివాహంలో ఒకే సగాకు చెందినవారు వివాహం చేసుకోకూడదు. తల్లిదండ్రుల సగకు చెందినవారు వివాహానికి పనికిరారు. పాహండి కుపార్ లింగో వివాహాన్ని గురించిన ఆలోచన శాస్త్రీయ పద్ధతిలో ఉన్నది. దీని ప్రకారంగా స్వగోత్రం వారు వివాహానికి పనికిరారు. ప్రధాన్ లు పన్నెండు గోత్రాలవారుగా విభజించబడినారు. వారిలో సరి సంఖ్య వారు సరి సంఖ్యవారిని వివాహం చేసుకోకూడదు. అంటే రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు సరిసంఖ్యలవారు సగోత్రీకులు అవుతారు. కాబట్టి వారు ఒకరికొకరు వివాహానికి పనికిరారని అర్థం. అలాగే బేసి సంఖ్య వారు బేసి సంఖ్య వారిని వివాహం చేసుకోకూడదు. దీనివల్ల ప్రధాన్ ల వివాహానికి సగ (గోత్రం) ముఖ్యమని తెలుస్తుంది.
వివాహం వరుని ఇంట్లోనే జరుగుతుంది. వీరిలో వాలి చెల్లించే విధానం ఉంది. వధువు ఇంటికి నిశ్చితార్థానికి వెళ్లే టప్పుడు వరుడు ఎన్ని సగాలకు చెందిన వాడైతే అన్ని కణుపులు కలిగిన వెదురు కట్టెను తీసుకొని వెళ్ళాలి. నిశ్చితార్థం, మర్యాదలు అయిన తర్వాత వధూవరుల బంధువులు బీడీచుట్టలను పరస్పరం అందించుకుంటారు. నిశ్చితార్థం అయినట్లుగా భావించి వెదురుకట్టెను వధువు ఇంటి చూరులో ఉంచి వస్తారు. వివాహం ముందు రోజు వధువును వరుని ఊరికి తీసుకుని వెళుతారు. వధువు సగాకు చెందిన వారి ఇంటిలోనే ఆమెకు, ఆమె బంధువులకు విడిదిని ఏర్పాటు చేస్తారు. వివాహం రోజు వధూవరులకు మంగళ స్నానం చేయించి పోచమ్మ (అవ్వల్ పేన్) గుడికి తీసుకొని పోయి పూజ చేయించి వధూవరుల చేతికి కత్తులను ఇస్తారు. ఇక వారు ఎక్కడికి వెళ్లినా ఆ కత్తులను పట్టుకుని వెళ్లాలి. ఒక ధోవతిని రెండుగా చింపి, వధువుకి సగం వరునికి సగం ఇస్తారు. దీనితో వారు ఒకటైనట్లుగా భావిస్తారు. పెండ్లి పందిట్లో జొన్నపిండి, పసుపు, కుంకుమ కలిపి ముగ్గు వేస్తారు. ముగ్గులలో ఐదు కుండలు పెట్టి వాటిలో జొన్నలు పోసి పైన ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగిస్తారు. వాటి చుట్టూ దారం చుడతారు. వధూవరులు పెళ్లి బట్టలతో వచ్చి కుండలకు ఐదుసార్లు ప్రదక్షిణలు చేస్తారు. తర్వాత వధూవరులు పీటల మీద కూర్చుంటారు. అప్పుడు నృత్యాలు చేస్తారు. తర్వాత కట్న కానుకలు వధూవరులకు ఇస్తారు. ఆడవారు కట్నాలు పెట్టేటప్పుడు డోలు నాదం ఒకరకంగానూ, మగవారు కట్నాలు పెట్టేటప్పుడు డోలు నాదం ఇంకోరకంగానూ ఉంటుంది. దాన్నిబట్టి వధూవరులను నిలబెట్టి స్త్రీ పురుషులు వేరువేరుగా బహుమతులు ఇస్తారు. వధూవరులకు కొబ్బరి చిప్పలతో హారతి ఇస్తారు. ఆ కొబ్బరిచిప్పలను వధువు ఆడవారికి, వరుడు మగవారికి ఇవ్వడం జరుగుతుంది. అనంతరం భోజనాలుతింటారు. పెళ్లికూతురు అప్పగింత లతో వివాహ కార్యక్రమం సంపూర్ణమవుతుంది.
అంత్యక్రియలు:- ప్రధాన్ లు మరణించిన వారిని సాధారణంగా ఖననం చేస్తారు. కొన్ని సందర్భాల్లో దహనం చేస్తారు. ఖననం చేస్తే ఐదవ రోజు, దహనం చేస్తే మూడవరోజు కర్మకాండలను నిర్వహిస్తారు. శవాన్ని మోసిన వారు మాత్రమే ఒక్కరోజు సూతకాన్ని పాటిస్తారు. 168