Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కట్టినట్లు ఉండే నగ. 'పోత్' అనేది మంగళసూత్రం నల్లపూసలతో కట్టబడి ఉంటుంది. దీన్ని వివాహితులైన స్త్రీలు ధరిస్తారు. పడిగె, బిర్యా, బుద్ధి అనేవి బంగారంతో చేయబడిన స్త్రీలు చెవులకు ధరించే ఆభరణాలు. ముక (ముక్కుపోగు), బేసరి, నత్ని, పుల్లి అనేవి స్త్రీలు ముక్కుకు ధరించే బంగారంతో చేయబడిన ఆభరణాలు, పాటి (వడ్డాణం) అనేది వెండితో చేయబడుతుంది. వేరా అనేవి కడియాలు. తీడేపంజన్ అనేవి పట్టగొలుసులు. చైన్ అనేది కాళ్లకు వేసుకొనే సన్నని గొలుసు. జోడివ్యా అనేవి మెట్టెలు. ముద్ది అంటే ఉంగరం. దండకడి మోచేతి పైన ధరించే కడియాలు. బహుటి అనేవి భుజాల దగ్గర ధరించే కడియాలు. వేర అనేవి చేతి మడికట్టు దగ్గర ధరించే కడియాలు. ఇవన్నీ వెండితో చేయబడిన ఆభరణాలు.

పురుషులు వెండితో చేసిన రెండు వరసల గొలుసును మొలతాడుగా (కర్ దొడ) నడుముకు కట్టుకుంటారు. ముద్ది (ఉంగరం)చేతులకు ధరిస్తారు. చేబాలి (పోగులు) చెవులకు ధరిస్తారు. ఇవి వెండితో చేసినవి. గాయ్ ముక్ వేర్ అనేది ఆవుతల ఆకారంతో చేసిన వెండి కడియం. న్యాయం చెప్పేటప్పుడు పటేల్ దీన్ని ధరిస్తాడు. పంచలోహాల కడియం వెండి రాగి ఇత్తడి ఇనుము బంగారంతో చేసిన కడియం. దీన్ని అందరూ ధరించరు. ఎవరికైతే పిడుగు పడే ప్రమాదం ఉన్నదని తెలుస్తుందో వారు మాత్రమే ధరిస్తారు.

b. ఆర్థిక పరిస్థితి:- పూర్వం ప్రధాన్ ల ఆర్థిక పరిస్థితి వారి పోషకులైన గోండుల ఆర్థిక పరిస్థితితో ముడిపడి ఉండేది. కాని కాలక్రమంలో ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. ప్రస్తుతం వీరు వ్యవసాయదారులుగా మారినారు. వీరు పత్తి, జొన్న, కందులు, పెసలు మొదలైన ధాన్యాలను పండిస్తున్నారు. కొందరు పట్టుపురుగుల పెంపకాన్ని కూడా ప్రారంభించారు.

C. న్యాయవ్యవస్థ: - ప్రధాన్ లు తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు, సామాజిక సంబంధాలు, కట్టుబాట్లు కట్టుదిట్టంగా ఉండడానికి “పంచ్” అనే కుల పంచాయితీ ద్వారా నిర్వహించుకుంటారు. ఈ పంచాయతీలో పటేల్ (పెద్ద), మహాజన్ (పూజారి), హవల్దార్ (వార్తావాహకుడు), కార్బారి (న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాలను భద్రపరిచేవాడు) ఖజానా దార్ (కోశాధికారి ) అనే వారు సభ్యులుగా ఉంటారు. పటేల్, మహాజన్ అనే ఈ రెండు వారసత్వంగా లభించే పదవులు.

d. మతవిశ్వాసం:- ప్రధాన్ లు దేవతారాధనను, పండగలను విశేషంగా జరుపుకుంటారు.

పెర్సాపేన్:- పుష్యమాసంలో ఊరి బయట ఇప్పచెట్టుపై ఉన్న పెర్సా పేన్ (పెద్దదేవుడు)ను భక్తిగా శ్రద్ధాసక్తులతో పూజిస్తారు. ఇలా చేస్తే వారికి మంచి జరుగుతుందని నమ్మకం.

భీమన్న మర్మింగ్:- ఇప్పచెట్టు దగ్గర గ్రామస్తులంతా భీమన్న పెళ్లి అని పూజలు చేస్తారు. తమ పొలంలో నాటుకునే విత్తనాలను అక్కడ పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. అందువల్ల పంటలు బాగా పండుతాయని భావిస్తారు.

అవ్వల్ పేన్:- గ్రామంలోని పిల్లాపాపలు ఆరోగ్యంగా ఉండాలని ఊరి మధ్యలో పోచమ్మ దేవతను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని పూజిస్తారు.

అకిపేన్:- రెండు చిన్నపాటి కర్రల మధ్య ఒక పొడవాటి కర్రను పెట్టి దానికి తెల్లటి గుడ్డను జండాగా కట్టి జెండా మధ్య భాగంలో సూర్యచంద్రుల ఆకారాలను వేసి పూజ చేస్తారు. భీమన్న పూజలో పెట్టిన విత్తనాలను తెచ్చి ఇక్కడ పెట్టి పూజ చేసి తర్వాత పొలంలో చల్లుతారు.

166