Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొందుపరిచి దాని ప్రకారంగా పలు అభివృద్ధి పథకాలను అమలు పరుస్తున్నారు. ఈ ప్రణాళికల్లో భాగంగా గిరిజనుల సంస్కృతి సంప్రదాయాల యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ, వాటిని భావితరాలకు అందించే విధంగా వివిధ సాంస్కృతిక కార్యకలాపాలను కూడా చేపడుతున్నారు. గిరిజన వీరులు, నాయకుల, దేవుళ్ళ జన్మదినాలు, పండుగలు రాష్ట్రవ్యాప్తంగా జరుపుతూ, వివిధ తెగల దేవాలయాలు, సామాజిక భవనాలు, మ్యూజియంలు నిర్మించడం ద్వారా గిరిజన కళలను, నృత్యాలను వారి యొక్క స్థితిగతులను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి, వారిచే తయారు చేయబడ్డ హస్త కళల వస్తువులను, అటవీ ఉత్పత్తులను ప్రదర్శించి వాటిని మార్కెటింగ్ కి అనుగుణంగా రూపొందించడం (రూపకల్పన), వారి భాషా లిపులను కాపాడడం, వీటితోపాటు త్రాగునీరు సాగునీరు వంటి తదితర పథకాలను చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ఆదివాసీల సామాజిక ఆర్థిక సాంస్కృతిక సాంప్రదాయక అభివృద్ధి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చక్కగా కృషి చేస్తున్నాయి.

ఈ రచనలో ఎరుకలు, లంబాడి, చెంచు, కోయ, కొండరెడ్డి, గోండు, నాయకపోడు, కోలామి, తోటి, అంధ్, ప్రధాన్ అనే గిరిజనులు పుట్టుపూర్వోత్తరాలను, గిరిజన పురాణ, చారిత్రక ఆధారాల ద్వారా తెలపడం, నాయక పోడులను గోండులతో కలిపి లెక్కించడం వల్ల తెలంగాణలో పది రకాల గిరిజనులు ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది. ఆయా గిరిజనుల పురాణాలను పరిశీలించి వారి మూలాలను గుర్తించడం చారిత్రక సమాచారాన్ని బట్టి వారి విస్తరణతో గిరిజనులకు ఏర్పడిన పేర్లను విశ్లేషించడం జరిగింది. తెలంగాణలోని గిరిజనుల ఉనికికి సంబంధించిన పూర్వ ఆధారాలను పేర్కొనడం జరిగింది. పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలలో వెలుగు చూసిన ఆదిమానవుల నివాసాలు, వారి జీవన విధానం, వారి పనిముట్లు, వారి రేఖా చిత్రాలు మొదలైన వాటిని బట్టి తెలంగాణలో ఆదిమానవులు వేల సంవత్సరాలనాడే నివాసమున్నట్లు నిరూపితమైన విషయీలు ప్రస్తావించబడినవి. తెలుగు సాహిత్యం ఆధారంగా భారతదేశంలో గిరిజనజాతులు యుగయుగాలుగా ఉన్నట్లు స్పష్టంచేయబడింది. ఆ యా కవుల వర్ణనల్లో గిరిజనుల వస్త్రధారణ, అలంకరణ, జీవన విధానం, అటవీ ఉత్పత్తుల సేకరణ, వాటిని రాజులకు బహుమతులుగా ఇవ్వడం మొదలైన అంశాలు తెలుపబడినవి. తెలంగాణలో నివసించే గిరిజనుల జీవన విధానం, వారి నివాస ప్రాంతాలు, వారి ఆర్థిక న్యాయవ్యవస్థలు, ఆచార వ్యవహారాలు, మత విశ్వాసాలు వారి సంపూర్ణ జీవన చిత్రీకరించబడింది. ఒక్కొక్క గిరిజన తెగకు ప్రత్యేకమైన నృత్య రీతులు, నృత్య సందర్భాలు వివరించడం జరిగింది. మత విశ్వాసాలను బట్టి, మనోల్లాసం కొరకు నృత్యాలను సామూహికంగా ప్రదర్శించడం గిరిజనుల ప్రత్యేకతగా చెప్పడం జరిగింది. ఇది వారి ఐకమత్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. గిరిజనులు తమ జాతిలోనూ, ఇంటిలోనూ జరిగే కార్యక్రమాలన్నిటికీ పాటలు పాడడం అందులో వారి జీవన చిత్రణ ప్రతిబింబించడం ప్రధాన అంశంగా కనిపిస్తుంది. సంగీతం నృత్యాలను ఆనంద సమయాల్లోనూ, విషాద సమయాల్లోనూ ప్రదర్శించి తమ భావ ప్రకటనకు ఆ కళలను సాధనంగా చేసుకోవడం గిరిజనుల ప్రత్యేకతగా పేర్కొనడం జరిగింది. తెలంగాణ గిరిజనతెగల్లో ఒక్కొక్క తెగ ఒక్కొక్క విధమైన ప్రత్యేకత కలిగిన సంగీత వాద్యాలను తయారు చేసుకున్నారు. అవి ఆ తెగను విశిష్టత తెలియచేస్తున్నాయి. అన్ని వాద్యాలను గిరిజనులు అడవిలో లభించే వస్తువులతోనే స్వయంగా వారే తయారు చేసుకోవడం విశేషంగా చెప్పడం జరిగింది.

3