Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిరాల్ నృత్యం:- తెలంగాణలోని బతుకమ్మ నృత్యం వలె సిరాల్ నృత్యం ఉంటుంది. పుట్ట మట్టిని తెచ్చి వీరు నాగదేవత, శివపార్వతుల విగ్రహాలను తయారుచేసి పూజించి, ఆ దేవతల చుట్టూ చప్పట్లు కొడుతూ గుండ్రంగా తిరుగుతూ పాటకు డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. ఆ తర్వాత సాయంకాలం ఆ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ సిరాల్ పండగ పూజలో పాల్గొన్న వారికి సంతానం కలుగుతుందని వీరి నమ్మకం.

వాఘే నృత్యం:- అంధ్ జాతి వాళ్లు ఉత్సవాల్లో వినోదం కోసం చేసే నృత్యం వాఘేనృత్యం. ఇది జంతువులు వేషధారణతో చేసే నృత్యం. అరణ్యవాసులైన ఆదివాసుల ప్రకృతి అనుకరణకు ఇది నిదర్శనం. ఈ నృత్యంలో ఆహార్యం, జంతువుల అలంకరణ, నడకల విన్యాసాలు చూపరులకు ఎంతో చక్కగా ఆకర్షణీయంగా ఉంటుంది.

దండారి నృత్యం:- అంధ్ జాతి వాళ్ళు సిరాల్ నృత్యం వాఘే నృత్యాలనే గాక సాధారణంగా అందరూ చేసే కోలాటం నృత్యం కూడా చేస్తారు. వీరు దీన్ని దండారి నృత్యం అంటారు. గోండులు, కోలామీలు చేసే విధంగా వీరి నృత్యంలో గుస్సాడీల ప్రవేశం ఉండదు. కళాకారులు కేవలం పొడవైన కర్రలను పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ అడుగులు వేస్తారు. ఈ దండారీలు ఒక్కొక్కరు పొడవైన ఒక కర్రని పట్టుకొని నృత్యం చేయడం ప్రత్యేకత.

నర్తకులు రెండు జట్లుగా ఏర్పడి మధ్యలో ఒక జట్టు, బయట ఒక జట్టు గుండ్రంగా ఏర్పడి, లోపలి వారు బయటకి బయటివారు లోపలికి మారుతూ కర్రలను తాకిస్తూ, వాద్యాల ధ్వనికి అనుగుణంగా అడుగులు వేస్తారు. డప్పు, డోలు వాద్యాలు నృత్యానికి సహకారం అందిస్తాయి.

158