Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తోటీల నృత్యాలు

3తోటీలు తమ దేవతలకు, దేవుళ్లకు వివిధ సందర్భాల్లో అనేక రకాల నృత్యాలను ప్రదర్శింపచేస్తారు. దండరి జౌరి, దింసా, గెర, బుర్రి, సత్తి, పోచమ్మ, చంటి, సత్తి, పెనయహవల్, ఫెన్ డోల్, భవులను, రసూల్, లగెడే అనే నృత్యాలను ప్రదర్శిస్తారు. దండారి దింసా నృత్యాలు ఇతర ఆదివాసీలు కూడా చేస్తారు. తోటీస్త్రీలు పెళ్ళిళ్ళ సందర్భంలో చేతులు కలిపి చేసే నృత్యం జౌరి. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి చేసే నృత్యం గెర. వినోదం కోసం స్త్రీ పురుషులు చేసే స్త్రీ నృత్యం బుర్రి. భీముడి కోసం చేసే నృత్యం సత్తి. ఉధృతమైన విన్యాసాలతో చేసేది పోచమ్మనృత్యం. ధర్మరాజు కోసం చేసే నృత్యం సత్తిక. జల్లిదేవర పండగలో చేసే నృత్యం ఫెన్ డోల్. ఈ నృత్యాలు అన్నిటికి కిక్రి, పెప్రె, ఖుజ్జి అనే వాద్య పరికరాలను ఉపయోగిస్తారు. నృత్య ప్రదర్శన సందర్భంగా సాధారణ దుస్తులనే ధరిస్తారు. ప్రత్యేక దుస్తులేమి ఉండవు. రాగి, ఇత్తడి నగలను మాత్రమే ధరిస్తారు. ఇది వారి పేదరికానికి నిదర్శనం.

దింసా నృత్యం:- గిరిజనుల్లో చాలా ప్రాచుర్యం పొందినది దింసా నృత్యం. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే కాక మనుషుల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే నృత్యం. ఇది గిరిజన జాతుల్లో ఎక్కువ మంది ప్రదర్శించే నృత్యం. ఇది ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ గిరిజనుల్లో ప్రారంభమై, ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న అరకు వ్యాలీ, బొర్రా కేవ్స్ దగ్గర ప్రసిద్ధమైంది. కానీ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో గోండులు, తోటీలు కూడ ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గిరిజనులు ఆనందంగా కలిసిమెలిసి నృత్య ప్రదర్శనలో పాల్గొంటారు. ఈ నృత్యానికి ప్రత్యేకించి ఆహార్యం ఏదీ లేకపోవడం, ఎక్కువగా విన్యాసాలు ప్రదర్శించేది ఉండక పోవడం విశేషం. స్త్రీలైనా పురుషులైనా నృత్య ప్రదర్శనలో గొలుసుకట్టుగా ఒకరి నడుముపై ఒకరు చేతులు వేసి లేదా భుజాలపై చేతులు వేసి, ముందుకు వంగి ఒక అడుగు, మరల వెనుకకు వంగి ఒక అడుగు వేస్తూ వాద్యాలకు అనుగుణంగా గుండ్రంగా తిరగడం ఇందులో కనిపిస్తుంది.

148