Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆహారం:- తోటీలు ప్రధానంగా జొన్న మొక్కజొన్న ధాన్యాలతో జావ, సంకటి చేసుకుని తింటారు. వీరు మాంసాహారులు. వీరు చేపలు, కోళ్ల, గొర్రెల, మేకల, కుందేళ్ళ మాంసాన్ని తింటారు.

వస్త్రధారణ: - స్త్రీలు సాధారణంగా చీర, రవిక ధరిస్తారు. పురుషులు పంచె ధోవతిని ధరిస్తారు.

ఆభరణాలు:- తోటిలు చాలా పేదవారు. కాబట్టి వారికి గొప్పగా ఆభరణాలను ధరించే స్తోమత లేదు. వివాహిత స్త్రీలు గాజులను, చెవులకు చిన్న కమ్మలను, కాళ్ళకు వెండి మెట్టెలను, మెడలో నల్లపూసల దండను ధరిస్తారు.

సాంస్కృతిక పరమైన ప్రత్యేకతలు:- తోటిలు తమ గూడానికి వచ్చిన బంధువులను మిత్రులను డోలు, పెప్రె, కాలికోం వాద్యాలతో లోపలికి ఆహ్వానిస్తారు. కాళ్ళకు నీళ్ళిచ్చి, నుదుటన బొట్టు పెట్టి," రామ్ రామ్” అని ఆలింగనం చేసుకుంటారు. అదేవిధంగా వెళ్లేటప్పుడు వివిధ వాద్యాలతో ఊరి చివర వరకు సాగనంపుతారు.

తోటిలు ఆనంద సమయా ల్లోనూ, విషాద సమయాల్లోనూ వారి భావాలను నృత్యరూపంలో వ్యక్తం చేస్తారు. దండారి, ధింసా,గేరా,బుర్రి నృత్యాలు వివాహసందర్భంలో చేస్తారు. సత్తి నృత్యం, జువారి నృత్యం పండుగ సందర్భాల్లో చేస్తారు.

b. ఆర్థిక వ్యవస్థ:- తోటిలు కొందరు గోదావరినది తీరప్రాంతాలకు వలస వెళ్లారు. వారు ఆ ప్రాంతంలో గోండులు లేకపోవడంవల్ల 'తోటి' కళారూపాన్ని నేర్చుకుని, దానికి అనుబంధంగా కిన్నెరను తయారు చేసుకుని, వాటికితోడు మృదంగం తాళాలతో అన్ని కులాల వారికి మహాభారత కథలు చెప్తూ "పాండవులోళ్ళుగా” ప్రసిద్ధి చెందారు. పాండవుల కథకు గ్రామాల్లో ప్రజాదరణ పెరగడంవల్ల వీరికి ఆదాయం లభించింది. అలాగే కొంతమంది పటం కళాకారులకు వాద్య సహకారం అందించి ఆదాయం పొందడమేగాక "పటం కథా ప్రదర్శన” నేర్చుకుని నాయకపోడుల ఉత్పత్తిని, పద్మ నాయకుల వృత్తాంతాన్ని పటం వేయించి పటం కథా ప్రదర్శనతో నాయకపోడులకు ఆశ్రితులుగా జీవనం సాగిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని తోటిలు గోండులకు ఆశ్రితులుగా ఉంటూ వారి పరిసర ప్రాంతాల్లోని స్థితిగతులను, సంబంధ బాంధవ్యాలను బంధుత్వాలను, వారికితెలుపుతారు. గోండురాజులకు పెళ్లి సంబంధాలు చూడడం, వంశ పురుషులు వీరగాథలు చెప్పడం, పండుగలు పెళ్లిళ్లు కర్మకాండలు మొదలైనవాటికి గోండుభాషలో కథా గానం చేయటమే వీరి ప్రధాన వృత్తిగా కలిగి వారివల్ల ధనం పొందుతారు. అంతేగాక తోటి స్త్రీలు గోండు, కోలామీ, ప్రధాన్, నాయకపోడు మొదలైన గిరిజన స్త్రీ లకు పచ్చబొట్లు వేసి ధనం స్వీకరిస్తారు. పచ్చబొట్లు వేయడంలో వీరు నేర్పరులు. పెదవేగి చెక్కను నీటిలో నానబెట్టి ఆముదపు దీపం మసిని ఆ నీటిలో కలిపి పచ్చబొట్టు ద్రవాన్ని తయారుచేస్తారు. దీన్ని వివిధ ఆకారాలలో చర్మంపై పచ్చబొట్టుగా వేస్తారు. ఈ పచ్చబొట్టు సంస్కృతికి ప్రతీకగా (చిహ్నంగా), అలంకరణగాను, వ్యాధులను నివారించేదిగాను ఉపయోగపడుతుందని గిరిజనులు నమ్ముతారు. కొందరు తోటిలు వ్యవసాయం చేస్తున్నారు. కొందరు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. కొందరు తోటీలు పాటలు పాడి ఆదాయాన్ని పొందుతున్నారు ఈ విధంగా తోటీలు కుటుంబంలోని వారంతా కష్టపడి సంపాదించుకొని తమ జీవనాన్ని సాగిస్తారు.

C. న్యాయవ్యవస్థ:- ప్రతి తోటి గ్రామంలోను గ్రామ పంచాయతీ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. గ్రామపంచాయతీలో పటేల్, మహాజన్, దేవరి, ఘటియాల్, హవల్దాల్ అనేవారు సభ్యులుగా ఉంటారు. పటేల్ పంచాయతీలో కులపెద్ద. ఇతడే న్యాయనిర్ణయాన్ని చేస్తాడు. మహాజన్ మతాధికారి, దేవరి పూజారి,

145