Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రతి కోలమీ గ్రామం మధ్య ప్రార్థనా స్థలం ఉంటుంది. అక్కడ భీమయ్యక్ అని కొయ్యబద్దలతో రూపొందించి నెమలి పింఛాలతో అలంకరించిన దేవుడు ప్రతిష్టించబడి ఉంటాడు.

8. ఆచార వ్యవహారాలు:-

జననం:- కోలామీ స్త్రీలు ఆసుపత్రులకు ప్రసవానికి వెళ్లరు. ఇంటి వద్దనే మంత్రసానితో ప్రసవాలు చేయించు కుంటారు. ప్రసవం అయిన తర్వాత పద్దెనిమిది రోజుల వరకు ఊరు బయట గుడిసె లో ఉండాలి. ఎవరితోనూ మాట్లాడకూడదు. పద్దెనిమిదవ రోజున బాలింతకు బిడ్డకు స్నానం చేయిస్తారు. ఇంటి ముందు కోడిని కోసి ఊరంతా పేడ నీళ్లు చల్లి గోమూత్రంతో శుద్ధి చేసిన తర్వాత అందరికీ భోజనాలు పెడతారు. అంతవరకు తల్లీబిడ్డలు క్రిందనే పడుకోవాలి. శుద్ధి జరిగిన తర్వాతనే వారిని లోనికి రానిస్తారు. బాలింత చేపలు, గుగ్గిళ్ళు తినకూడదు. పూజారి పూజ చేసిన తర్వాత ఆయన ఒంట్లోకి దేవుడు వచ్చి ఏ పేరు చెబితే ఆ పేరు బిడ్డకు పెడతారు.

వివాహం:- కోలామీలు ఏకపతిపత్నీ వ్రతాన్ని పాటిస్తారు. వీరు సంప్రదింపులు (కడియం), ఎత్తుకు పోవడం (సుమా తప్సార్), ప్రేమ పలాయనం (గొరక లేదా రేస), చొరబాటు (ఎల్లసుంక్త), ఇల్లరికం (ఇల్లటం) అనే పద్ధతుల్లో వివాహం చేసుకుంటారు.

సంప్రదింపుల వివాహం పెద్దల అనుమతితో జరుగుతుంది. పెద్దలు అమ్మాయిని అడగడానికి వెళతారు. అందరికీ అంగీకారం అయితే నిశ్చితార్థం రోజున జొన్నల మూట ను తీసుకొని వస్తారు. ఒక కట్టెను (సొరకకోల) కూడా తీసుకుని వస్తారు. అనుకూలమైన రోజున పెళ్లికి ముహూర్తం నిశ్చయించుకొని వధువు ఇంటి చూరులో కట్టెను (సొరకకోల) గుచ్చి వెళతారు.

వివాహం వరుని ఇంటిలోనే జరుగుతుంది. వరుని ఇంటిదగ్గర నాలుగు గుంజలతో పందిరి వేసి నాలుగు గుంజల దగ్గర కొత్త కుండలు పెట్టి వాటిలో జొన్నలు వేసి పైన ప్రమిదలలో దీపాలు వెలిగిస్తారు. వాటిచుట్టూ ముగ్గులు వేసి దారాలు కడతారు. వధువు వరుని ఊరికి వచ్చిన తర్వాత ఊరిలోని అందరి ఇంటికి తీసుకొనిపోయి స్నానం చేయించి బట్టలు పెడతారు. పసుపు రాసి చేతికి కత్తిని ఇస్తారు. పసుపు కొమ్మును చేతికి కడతారు. కత్తిని వధువు పెళ్లి అయ్యేవరకు పట్టుకుని ఉండాలి. ఇలా చేయడంవల్ల వధువుకు దిష్టి తగలదని వారి నమ్మకం. పెళ్లి పందిరి దగ్గరకు వధువు వరుడు వెళ్లే సమయంలో వారి వారి వదినలు పళ్ళెంలో పసుపు బియ్యం జొన్నలు కలిపి దీపం పెట్టి హారతి ఇస్తారు. వధూవరులు పెళ్లి పందిరిలో చేరిన తర్వాత బంధువులందరూ నృత్యాలు చేస్తారు. వివాహ తంతు జరిగిన తర్వాత వధూవరులను ఊరి చివర పోచమ్మ దేవత దగ్గరకు తీసుకెళ్లి పూజ చేయిస్తారు. మేనత్త మేనమామ వధూవరులకు మెడకు నడుముకు తుండుగుడ్డను కడతారు. వాటిలో బంధువులు డబ్బులు, బహుమతులు వేస్తారు.

అంత్యక్రియలు:- కోలామీ జాతి వారిలో ఒకరు మరణించినప్పుడు ఆ ఊరిలోని ఒక వ్యక్తికి దేవుడు ఒంటి మీదకు వచ్చి మరణించిన వ్యక్తిని పూడ్చాలా లేక కాల్చాలా అనేది చెప్తాడు. దాన్ని వారు పాటిస్తారు. శవాన్ని తడికలలో చుట్టి గాని మంచంపై పెట్టి గాని స్మశానానికి తీసుకుపోతారు. దేవుడు ఒంటి మీదకు వచ్చిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహిస్తాడు. బాలింత గాని పెళ్లి కాని వారు గాని మరణిస్తే వాళ్ళు పిశాచాలు అవుతారని నమ్ముతారు. అందుకని వారికి ఆవును కోస్తారు. దేవుని విగ్రహం పట్టుకొని గ్రామం చుట్టూ శుభ్రం చేసి గ్రామం నాలుగు మూలల నాలుగు రాళ్లు పాతి పెడతారు. తర్వాత కొరడా పట్టుకొని గ్రామం చుట్టూ తిరుగుతారు. కోలామీలకు ఆత్మలు, దెయ్యాలు, పిశాచాలు మీద నమ్మకం ఎక్కువ. చనిపోయిన వారిని పూడ్చినా కాల్చినా తర్వాత వారు స్మశానం వైపు మళ్ళీ వెళ్లరు. స్మశానం ఊరికి చాలా దూరంగా ఉంటుంది.

135