Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వస్త్రధారణ: - కోలామీస్త్రీలు సంప్రదాయ చీరకట్టు ప్రత్యేకంగా ఉంటుంది. ఇది పంచకట్టు వలె కనిపిస్తుంది. ఆధునిక స్త్రీలు చీర రవికను ధరిస్తున్నారు. పురుషులు పెద్దలు తెల్లని చొక్కాను ధోవతిని ధరిస్తారు. చిన్నవాళ్ళు ప్యాంటు షర్టు వేసుకుంటున్నారు.

ఆభరణాలు:- కోలామీలు కళాత్మక ఆభరణాలను ధరిస్తారు. 'కవ్వేంగర్' అనేవి చెవి దుద్దులు. 'పొట్టి' అనేది నల్లపూసలతో తయారుచేసిన గొలుసు. పెళ్లిలో వరుడు వధువు మెడలో దీనిని వేస్తాడు. 'కంటె' అనేది గుండ్రంగా మెడ చుట్టూ ఉండే వెండి ఆభరణం. 'వేలార్ సంకాలమ్' అనేది చాలా పెద్ద గొలుసు. ఇది మూడు నుండి ఐదు వరుసలు కలిపి చేసిన వెండి గొలుసు. దీన్ని వివాహసమయంలో వరుడు వధువుకు బహూకరిస్తాడు. దండకడియ అనేది వెండితో చేసిన ఆభరణం. దీన్ని అల్యూమినియం తో కూడా చేయించుకుంటారు. ఇది మోచేతి పైన ధరించే ఆభరణం. బాజి బ్యాండ్ అనేవి చేతి కడియాలు. మొల్ పట్టి అంటే వడ్డాణం. కాల్ కడియ అంటే కాళ్ల కడియాలు. తుమ్మ కాయ బిళ్ళలు అనేవి కూడ కాళ్ళకు పెట్టుకునే ఆభరణాలు. గిట్టవెంచె అనేవి మెట్టెలు.

b. ఆర్థిక వ్యవస్థ:- కోలామీలు నివసించే ప్రాంతంలో వెదురు బాగా లభిస్తుంది. వీరు దాదాపు ఇరవై రకాల బుట్టలు, తడికలు, విసన కర్రలు, ధాన్యం నిల్వచేసే గుమ్మీలు ఆకర్షణీయమైన చేతికర్రలను తయారుచేస్తారు. వెదురును కొట్టేటందుకు గొడ్డలిని, వాటిని చీల్చేటందుకు కొడవలిని, వాటిని నున్నగా చేసేటందుకు చిన్నకత్తిని ఉపయోగిస్తారు. కోలామీ స్త్రీలు మిక్కిలి కష్టజీవులు. వీరు ఇప్పపువ్వు, వంటచెరకు వంటి చిన్నతరహా అటవీ ఉత్పత్తులను సేకరిస్తారు. వీరు పురుషులు చేసే వ్యవసాయానికి సహకరిస్తూనే తమ ఇంటి పనులను కూడా చేసుకుంటారు.

C. న్యాయవ్యవస్థ: - ప్రతి కోలామీ గ్రామంలో గ్రామపంచాయతీ ఉంటుంది. అందులో కులపెద్ద, పూజారి, వార్తా వాహకుడు, వంటవాడు, వడ్డించేవాడు అనే వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. గ్రామపెద్ద, పూజారి, గ్రామంలోని ఇతర సభ్యులతో కలిసి గ్రామ సమస్యలను పరిష్కరిస్తారు.

d. మత విశ్వాసాలు:- కోలామీలకు రెండు రకాల దేవతలు ఉన్నారు

1.మేలు చేసే దేవతలు:- భీమదేవర, సీతాదేవి, లక్ష్మీదేవి, ఎడుమాలదేవి. భీమదేవర మహాభారతంలోని పాండురాజు కుమారుడు. ఇతనిని వీరు తమ మూలపురుషుడుగా భావిస్తారు. ఎడుమాలదేవిని రెండు పర్వత శ్రేణులకు అధిదేవతగా కొలుస్తారు.

2. హాని కారక దేవతలు:- నడియమ్మ, పోచవ్వ, కుసుబ అనే దేవతలను కోలామీలు తమ పంటపొలాలు, పశుసంపద సమృద్ధిగా ఉండేటందుకు పూజలు నిర్వహిస్తారు. ఆ సందర్భాల్లో పిల్లనగ్రోవి, డప్పు వాద్య సంగీతాలతో ఉత్సాహంగా కోలామీలు పాల్గొంటారు.

పండగలు: -కోలామీలు పొక్కెకొత్త అనే పండుగను ఇప్పపువ్వులు పూసిన సందర్భంలో జరుపుకొంటారు. మొండోస్ అనే పండగ కోలామీల నూతన సంవత్సరం. భీమయ్యక్ లగ్న అనేది భీమయ్య దేవర పెళ్లి పండుగ. మామిడి పెండ్లి అనేది మామిడి ఫలసాయాన్ని మొదటిసారిగా తినేటందుకు నిర్వహించే పండగ. కొత్త పండుగ కొత్త ధాన్యపు గింజలు తినేటందుకు చేసుకునేది. తికలి పండగ తమ పూర్వీకుల గౌరవార్థం చేసుకునే పండుగ. అకాడి పండగ జూన్ జులై నెలలో పొలాల్లో విత్తనాలు చల్లే టప్పుడు చేసేది. పోల పండుగ జూలై ఆగస్టు నెలల్లో చేసే పశువుల పండుగ. పుష్యమాసం డిసెంబర్ జనవరి నెలల్లో చేసేది పోతురాజు పండుగ.

134