08. తెలంగాణ గిరిజనులు కోలామీలు
ఆదిలాబాద్ జిల్లాలో మరొక ముఖ్యమైన తెగ కోలామీలు. వీరు ద్రావిడ భాష కుటుంబానికి చెందిన కోలామీ భాషను మాట్లాడతారు. వీరు తమను తాము "కోలవార్ "అని పిలుచుకుంటారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో కూడా, కోలామీలు నివసిస్తున్నారు. "కోలా” అంటే కర్ర అని అర్థం. వీరు నివసించే ప్రాంతంలో వెదురు చెట్లు ఎక్కువగా లభిస్తాయి. వీరు ఆ వెదురు బొంగుల్ని ఉపయోగించి ఎంతో నైపుణ్యంతో బుట్టలు, మంచి కళాత్మకమైన వస్తువులు, కంచెలు మొదలైన వాటిని తయారుచేస్తారు. అటవీ శాఖ వారు కూడా వీరికి అగరుబత్తీలను తయారు చేయడంలో శిక్షణ ఇప్పించారు. వీరిని, మన్నెవార్లు, అని కూడా అంటారు. మన్నెవార్లు అంటే అడవులలో నివసించేవారు అని అర్థం. వీరికి మన్నె గోండులు అనేది కూడా మరొక పేరు. కోనామీలు గోండుల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. వీరు ఒకరి ఇంట్లో ఇంకొకరు భోజనాలు చేస్తారు. కానీ వారి మధ్య వివాహ సంబంధాలు లేవు. వీరు భీమునికి హిడింబికి పుట్టిన సంతతిగా చెప్తారు. కోలామీలు భీముని తమ దేవుడిగా అతని భార్య హిడింబిని ఇష్ట దేవతగా పూజిస్తారు.
కోలామీల సంస్కృతి
కోలామీలు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, ఉట్నూర్, వాంకిడి, ఆసిఫాబాద్ తాలూకాలలో తమ ప్రత్యేకమైన జీవనశైలిని సంస్కృతిని సంప్రదాయాలను నిలుపుకుంటూ జీవిస్తున్నారు. వీరు తమ పూర్వీకులు గోండులకు పూజారులుగా ఉండేవారని పేర్కొంటున్నారు. వీరు కోలామీ భాషలో మాట్లాడతారు. కోలామీ ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. కొందరు స్థానిక భాష తెలుగును కూడా మాట్లాడు తున్నారు. వీరు చూసేందుకు పొట్టిగా దృఢంగా కనిపిస్తారు.
1a. జీవన విధానం:- కలప కర్రలతో నిర్మాణం చేసిన చతురస్రాకారపు చట్రం పై జొన్నగడ్డి కప్పబడి వీరి నివాసం ఉంటుంది. ఇంటి ముందు పందిరి వేసుకుంటారు. వీరు కొండ ఏటవాలు ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకుంటారు.
ఆహారం:- కోలామీలు తమ జీవనోపాధికై పోడు వ్యవసాయాన్ని చేస్తారు. కోలమీ భాషలో దీన్ని 'వేగాద్' అంటారు. దీనికి వీరు వాడే పనిముట్లు భూమి పైపొరను చెదరగొట్టేటందుకు 'కొంక' అనే పరికరాన్ని, గుంటలు తీసేటందుకు వెదురు కర్రను, భూమిని దున్నడానికి 'తిప్పన్'అనే నాగలిని, విత్తనాలు చెల్లేణటందుకు 'వక్కుర్' అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. వీరు తమ ఆహారంగా జొన్నలను ఉపయోగిస్తారు. ఆహారం లోనికి కందులు మినుములు పండించు కుంటారు. వీరు మాంసాన్ని తింటారు. వీరు మాంసంలో పశువుల, పంది మాంసం కూడా తింటారు.
133