Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెళ్లి పాటల్లో సీతారాముల ప్రస్తావనలు చేస్తూ నాయక పోడులు పాడే పాటలు కనిపిస్తాయి. వరుని రాముని గాను, వధువును సీతగాను భావించి పాడటం భారతదేశ సాహిత్యంలో సాధారణంగా కనిపిస్తుంది. సీతారాములు ఆదర్శ దంపతులు కాబట్టి వారిని గురించి పెళ్లి పాటలు ఉండడం సహజం.

20"చేరేడు ముగ్గు చేతన బట్టి
పోలాయి మంగలి పోలాయి
పందిట్లో ముగ్గు వేసే పోచమ్మ
శ్రీరాములు నల్లపూసల దండ మెడలోన కడతాడు పోచమ్మ....”

పందిట్లో ముగ్గు వేయడం, మంగలి మేళం వాయించడం, శ్రీరాముడు నల్లపూసల దండను వధువు సీత మెడలో కట్టడం అనే అంశాలు ఇక్కడ పేర్కొనబడినాయి. పోచమ్మ అనేది ఈ పాటకు ఊత పదం. పాటకు ఊపునిచ్చేది ఊతపదం. వరుని శ్రీరామునిగా భావించడం, వధూవరులు కూర్చునే చోట ముగ్గులు వేయడం, వాద్యాలు వాయించడం, నల్లపూసలను వధువు మెడలో కట్టడం అనే సంప్రదాయాలు ఈ పాటలో కనిపిస్తున్నాయి.

21చెల్లె సీతా చాలా దుఃఖము కలిగెనే మూడేసి ముత్యాలు పోసీ సాగదోలంగా మాకు చాల దుఃఖమూ కలిగెనే

సీత చాలా దుఃఖము కలిగెనె..... "


ఈ పాటను నాయకపోడు స్త్రీలు వివాహం జరిగిన తర్వాత వధువుకి ఒడి బియ్యం పోసి అత్తగారింటికి సాగనంపేటప్పుడు పాడతారు. 'ముత్యాల వంటి ఒడి బియ్యం పోసి అత్తగారింటికి సాగనంపాలంటే మాకు చాలా దుఃఖం కలుగుతుందది' అనేది ఈ పాటలోని భావం.

ఆడపిల్లను అత్తగారింటికి పంపించేటప్పుడు ఏ పుట్టింటి వారైనా వ్యక్తం చేసే బాధ దుఃఖం ఈ పాటలో ప్రస్పుటంగా కనబడుతుంది. నాయకపోడుల వ్యవసాయపంట జొన్నలు. వాటిని ముత్యాలతో పోల్చడం ఈ పాటకిని చక్కని ప్రతీకగా చెప్పడం విశేషం.

వధువును సీతగా సంబోధిస్తూ ఈ పాటను పాడటం కనిపిస్తుంది.

నాయక పోడులు దసరా పండగను జరుపుకుంటారు. ఆ సమయంలో జమ్మి పూజలు చేస్తారు. అప్పుడు పాడే పాట ఈ క్రింది విధంగా ఉంటుంది.
<poem>
22"జమ్మి రావో జమ్మి నల జమ్మికాన,
పాండవుల ఆయుధాలు దాచిన పూ జమ్మి,
జమ్మిచుట్టూ తిరిగి దండాలు పెట్టు....."

'జమ్మిచెట్టుకి పూజ చేద్దాం రండి. పాండవుల ఆయుధాలు దాచిన ఈ జమ్మిచెట్టుకు ప్రదక్షిణాలు చేసి దండాలు పెడదాము రండి' అని ఈ పాటలోని భావం.

నాయక పోడులకు కులదైవం పాండురాజు. కనుక వీరు జమ్మి పూజ చేస్తూ పాటలు పాడతారు. పాండవుల ఆయుధాలు దాచిన జమ్మీగా జమ్మి చెట్టును స్తుతించి జమ్మికి ప్రదక్షిణాలు చేస్తూ నమస్కరిస్తూ పాటలు పాడుతారు.

129