ఇలా సాగే ఈ పాట పెండ్లి సమయంలో పాడతారు. వధువుకు సంబంధించిన బంధువుల సంబంధాన్ని గుర్తు చేస్తూ, వారి ప్రేమకు ప్రతీకగా తెచ్చే బహుమతులను గూర్చి తెలుపుతూ, పెళ్లికి ఎవరెవరు వచ్చారో తెలిసే విధంగా ఈ పాటను పాడతారు. ఇందులో రక్తసంబంధీకులైన అన్నలు, మామలు, తాతలు, అక్కలు, మొదలైన వారి గురించి ప్రస్తావించడం జరిగింది. అల్లో నేరేడు అంటే జంబూ ఫలం. ఇది ఈ పాటకు ఊతపదం. పోచమ్మ నాయకపోడుల గ్రామదేవత. ఆషాడమాసంలో ఆమెకు బోనాలు సమర్పించే సమయంలో స్త్రీలంతా కలిసి పాడే పాట ఇలా ఉంది.
18"తల్లి రాయే పోచమ్మ తల్లి,
నీ ముద్దు మొక్కులు, కుంకుమలు, తెచ్చినామే పోచమ్మ తల్లి,
కోడిపుంజులు, మేకపోతులు, బోనాలు తెచ్చినామే పోచమ్మ తల్లి....”
సాధారణంగా గ్రామదేవత అనారోగ్యాల నుండి, ఆపదల నుండి కాపాడుతుందని ఆదివాసుల నమ్మకం. తమ కోరికలు తీర్చమని అందుకు బదులుగా ఆమెకు ఇష్టమైనవి సమర్పించుకుంటామని మొక్కుతారు. అలాంటి పోచమ్మని గురించిన పాట ఇది.
'తల్లి పోచమ్మ నీకు ఇష్టమైన వాటిని సమర్పించి నీ మ్రొక్కులు తీర్చుకుందామని వచ్చాము.మా కోరికలు తీర్చినందుకు మ్రొక్కిన విధంగా బోనాలు కోడిపుంజులు మేకపోతులు తెచ్చాము' అని ఈ పాటకు అర్థం. బోనం అంటే భోజనం అని అర్థం. శక్తిదేవతయైన పోచమ్మకు బలి ఇవ్వటం నాయకపోడుల సంప్రదాయం. ఆదివాసి గిరిజనులందరిలోనూ బలి ఇచ్చే సంప్రదాయం సాధారణంగా కనిపిస్తుంది.
పంటలు చక్కగా పండాలని భూమాతకు మొక్కుతూ పూజ చేసే సమయంలో నాయకపోడులు పాటలు పాడుతారు. ఆ పాట ఇలా ఉంది.
19"భూసింత పూసింది,
భూసింత కాసింది,
పాండవుల భూలక్ష్మి,
నీకు నివాళి......”
ఇలా సాగే ఈ పాటకు నాయక పోడుల పురాణంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నాయక పోడులు లక్ష్మీదేవి సంతానంగా భావిస్తారు. వారికి వ్యవసాయం చేసుకోవడానికి అవసరమైన వస్తువులు ఇచ్చి, వ్యవసాయం చేసుకొని జీవించమని లక్ష్మీదేవి చెప్పిందని పురాణ కథనం. అందుకే వారు వ్యవసాయం ప్రారంభించేముందు భూదేవిని లక్ష్మీదేవిని తలుచుకుంటూ పూజలు చేసి పాటలు పాడతారు.
లక్ష్మీదేవిని పాండురాజు పెంచి శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడని వారి పురాణ కథనం. కాబట్టి పాండవులతో వారికి సంబంధం ఉన్నట్లుగా చెప్పుకుంటారు. ఆ విషయాన్ని పై పాటలో తెలపడం విశేషం.
పైరు చక్కగా పూతకు వచ్చి బాగా పండింది. పాండవుల భూలక్ష్మి అందుకు నీకు నివాళులు అర్పిస్తున్నాము' అని ఈవిధంగా సాగే ఈ పాటలో సస్యలక్ష్మిస్తుతి కనిపిస్తుంది.
128