d. మత విశ్వాసాలు:- కాకతీయ రాజుల కాలంలో నాయకపోడులు భద్రాచలం ప్రాంతంలో కాపయనాయకుని నేతృత్వంలోను, రాచకొండ ప్రాంతంలో సింగంబోయని నేతృత్వంలోను రాజ్యపాలన సాగించారు. ఎడతెరిపిలేని అంతర్గత యుద్ధాలతోను, తురుష్కుల దండయాత్రలతోను తమ వారినెందరినో కోల్పోయిన వీరు దట్టమైన అడవులలోనికి పారిపోయారు. ఈ నాయక రాజ్యాలలోనివారే ఇప్పటి నాయకపోడులు. కనుక నేటికీ పద్మనాయకరాజ్యాలను ఏలిన ప్రోలయనాయకుని, సింగబోయని నాయకపోడులు పూజిస్తారు. తురుష్కుల యుద్ధాలతో అడవుల పాలైన ఈ నాయకపు వాళ్ళు తమ ఉనికి శత్రువులకు తెలియకుండా రహస్య భాషను ఉపయోగించేవారు.
వీరు నివసించిన నది నీటిని బట్టి వీరు రెండు గోత్రాలుగా ఏర్పడ్డారు.
1. పాలకాయగోత్రం:- గోదావరినది తీరప్రాంతంలోనికి వెళ్ళినవారు ఆ నది పాలవంటి తెల్లని నీటిని బట్టి పాలకాయగోత్రంవారుగా ఏర్పడ్డారు.
2.నల్లెల్ల గోత్రం:- కృష్ణా నది నీరు నల్లగా ఉంటుంది కాబట్టి ఆ నదీ తీరంలో స్థిరపడినవారు నల్లెల్ల గోత్రంగా ఏర్పడ్డారు.
పాలకాయ గోత్రంవారు శైవ మతాన్ని ఆచరిస్తూ విభూతి ధారణ చేస్తారు. వీరిని ఊబిదదారులు అంటారు. వీరు చంద్ర వంశంవారిగా చెప్పుకుంటారు. నల్లెల్ల గోత్రానికి చెందినవారు వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి మూడు నామాలు పెట్టుకుంటారు. వీరు సూర్యవంశం వారుగా చెప్పుకుంటారు. ఈ భేదం వారి పెళ్లి మరియు చావుల సందర్భాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతంలో నివసించే నాయకపోడులు వేసవి చివర భీమన్న పండుగ చేస్తారు. ఈ సందర్భంగా పెళ్లయిన ఆడ పిల్లలను వారి భర్తలను పిలిచి పుట్టింటిలో బట్టలు పెట్టడం ఆనవాయితీగా చేస్తారు. సకాలంలో వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ పండుగను చేస్తారు. వీరు శక్తి పండుగను చిక్కుడు కాయలు కాసే కాలంలో చేస్తారు. ఆషాడమాసంలో పోచమ్మకు బోనాలు పండుగ చేస్తారు.
నాయకపోడులకు లక్ష్మీ దేవర పండుగ ముఖ్యమైనది. ఈ దేవత వారికి ఇలవేల్పు కావడానికి ఒక కథ ప్రచారంలో ఉంది. కర్ణుడు నారదుని సలహాతో ధర్మరాజుని తనకు పెళ్లి చేయమని అడుగుతాడు. శత్రువు అయినప్పటికీ ధర్మరాజు మగధ దేశంలోని నందిగాముని కూతురుతో కర్ణుని పెళ్లి చేయాలని అనుకుంటాడు. కాని నందిగాముని తండ్రిని పాండురాజు చంపాడనే విషయాన్ని తల్లి ద్వారా తెలుసు కున్న అతడు ధర్మరాజును బంధించి హింసించసాగాడు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజును రక్షించడానికి పాండవులను యుద్ధానికి పిలిపించాడు. అప్పుడు రుక్మిణి తన సోదరుడైన నందిగామునికి సహాయంగా మారువేషంలో పాండవులతో యుద్ధం చేస్తుంది. అర్జునుడు గుర్తించలేక మారువేషంలో ఉన్న రుక్మిణిని నందిగాముని తమ్ముడని భావించి బాణం ప్రయోగించగా రుక్మిణి తలతెగి మద్దిచెట్టు సమీపంలో పడుతుంది. పాండవులకు కృష్ణునికి యుద్ధరంగంలో రుక్మిణి మొండెం కనిపిస్తుంది. అప్పుడు కృష్ణుడు ఆమె మొండానికి గుర్రం తలను అతికించి బతికించాలని అనుకున్నాడు. ఇంతలో నాయకపోడులు కందమూలాల కోసం అడవిలో తిరుగుతూ ఉండగా వారికి రుక్మిణి తల కనిపించింది. దాన్ని తీసుకుని వచ్చి శ్రీ కృష్ణునికి వారు అందజేశారు. కృష్ణుడు ఆ తలను రుక్మిణి మొండానికి అతికించి ప్రాణం పోశాడు. అప్పుడు గుర్రం తలకు కూడా ప్రాణం వచ్చింది. శ్రీకృష్ణుడు నాయకపోడులకు కృతజ్ఞతగా గుర్రం తలను లక్ష్మీదేవరగా పూజిస్తే లక్ష్మీకటాక్షం లభిస్తుందని, ఆమె వారికి రక్షణగా ఉంటుందని చెప్పాడు.
123