Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కనుక నీవు నా బిడ్డవే” అని చెప్పి అతనికి కొర్రాజు రామచంద్రయ్య అని పేరు పెట్టాడు. అప్పుడు పద్మనాయకునికి లక్ష్మీదేవి శ్రీకృష్ణుల వివాహం గురించి కబురు అందింది. పద్మనాయకుడు తనతో కొర్రాజు రామచంద్రయ్యను కూడా తీసుకొని లక్ష్మీదేవి పెళ్లికి వెళ్ళాడు. పెళ్లి అయిన తర్వాత శ్రీకృష్ణుడు పారుటాకు మీద త్రిమూర్తుల బొమ్మలతోపాటు దేవతల బొమ్మలు కూడా వేయించి కొర్రాజు రామచంద్రయ్యకిచ్చి పద్మనాయకుల వృత్తాంతాన్ని కీర్తిస్తూ వారి దగ్గర ధనం తీసుకుని జీవించమని చెప్పాడు. ఈ కథ నాయక్ పోడు, చెంచు, కోయ జాతుల పుట్టుకను గురించి తెలియజేస్తున్నది. నాయక్ పోడులను ఒకప్పుడు బోయలు అనేవారు. వీరు స్వతంత్రంగా రాజ్యాన్ని పరిపాలించేవారు. వీరు కొన్ని దుర్గాలను కూడా కట్టించారు. వాటిని "బోయదుర్గాలు” లేదా “బోయకొట్టాలు” అని అంటారు.

నాయకపోడుల సంస్కృతి

పాండవులను కులదైవాలుగా భావించే నాయకపోడులు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉన్నారు. ఇతర జిల్లాల్లో తక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు.

2a. జీవన విధానం:- నాయకపోడులు తమ గుడిసెలను చతురస్రాకారంలో నిర్మించు కుంటారు. పై కప్పును కంది కట్టెలతో వేసి గడ్డితో కప్పుతారు. ఇంటి చుట్టు వర్షపు నీరు పోవడానికి చిన్న కాలువను తవ్వుకుంటారు.

ఆహారం:-నాయకపోడుల ప్రధాన వృత్తి పోడు వ్యవసాయం. వీరు మొక్కజొన్నలను, జొన్నలను అధికంగా పండిస్తారు. చెరువుల్లో దొరికే రకరకాల గడ్డలను తింటారు. ఈ దుంపలను తవ్వడానికి గస్కె కర్రలను లేదా కర్రు కొయ్యలను వినియోగిస్తారు. కుటుంబంలోని స్త్రీలు గృహంలోని పనులతోపాటు పురుషులకు సహాయంగా దుంపల సేకరణలోను చేపలవేటలోనూ సహకరిస్తారు.

వస్త్రధారణ:- పురుషులు తెల్ల చొక్కాను, తెల్లపంచెను కట్టుకుంటారు. స్త్రీలు సాధారణంగా ఆధునిక స్త్రీల వస్త్రధారణలోనే ఉన్నారు. చీర రవిక ధరిస్తున్నారు.

ఆభరణాలు:- స్త్రీలు ముక్కుకు ముక్కెర, చేతులకు కాళ్ళకు కడియాలు ధరిస్తారు. వివాహితులు కాళ్ళకు మెట్టెలు, మెడలో నల్లపూసల దండను వేసుకుంటారు. వీరు ఇతర ఆదివాసీల కంటే కొంత భిన్నంగా కనిపిస్తారు. ఆధునిక సామాజిక వస్త్రధారణ ప్రభావం వీరి పై ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

b. ఆర్థిక వ్యవస్థ:- నాయకపోడుల ప్రధానమైన వృత్తి వ్యవసాయం. వీరు పోడు వ్యవసాయం చేసి జొన్నలు, మొక్కజొన్నలు, కందులు, మినుములు మొదలైన వాటిని పండిస్తారు. వీరు తునికి ఆకులను, ఇప్ప పువ్వులను సేకరించి అమ్ముకుంటారు. వీరు పశువులను పెంచి వాటిని సంతలో అమ్ముకొని తమ ఆర్థిక అవసరాలకు వినియోగించుకుంటారు.

C. న్యాయవ్యవస్థ:- నాయకపోడులు గూడానికి ఒక కుల పెద్ద ఉంటాడు. అతని ఆధ్వర్యంలో వీరు తమ సమస్యలను పరిష్కరించు కుంటారు. పండుగలు ఉత్సవాలు కులపెద్ద ఆధ్వర్యంలోనే జరుగుతాయి. వీరు కుల పెద్దకు అత్యంత ప్రాధాన్యం, గౌరవం ఇస్తారు. నాయకపోడులు అన్ని విషయాల్లోనూ హిందూ సమాజానికి దగ్గరగా ఉంటారు.

122