Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తయారుచేసిన చట్రాలను పైన ఊదే వైపున చిన్నగాను, క్రింద వైపు గంట ఆకారంలోను రెండువైపులా అమర్చుతారు. దీనికి ఊదే వైపున పీకను అమర్చి మధ్యలో ఏర్పరచిన రంధ్రాలను మూస్తూ తెరుస్తూ మధురమైన శబ్దాన్ని పలికిస్తారు. ఆదివాసీలు జానపదులు శిష్టులు కూడా ఇష్టపడే సంగీత వాద్యం ఇది.

19కాలికోం:- కాలికోం వంక తిరిగిన సుషిర వాద్యం. దీనిని కంసాలి వాళ్లు తయారుచేస్తారు. దీన్ని గోండులు "తూటు కొమ్ము” అంటారు. దీన్ని గ్రహణ సమయంలో రాగి లేక ఇతడితో తయారుచేస్తారు. కంసాలి దంపతులు ప్రత్యేకంగా దీన్ని నిష్టతో పవిత్రంగా తయారుచేస్తారు. దీన్ని "మూడు మూపురాలు నంది” అని పిలుస్తారు. అంటే మూడు మూపురాలు కలిగిన వృషభం అని అర్థం. ఏదైనా పని చేసే ముందు శుభ సూచకంగా కాలికోమ్ను ఊదుతారు. నృత్యప్రదర్శనలో నర్తకులకు ఉత్సాహం కలిగించి ఊపు నివ్వడానికి మధ్య మధ్యలో కాలికోమ్ ను ఊదుతారు. ఇది కొమ్మువాయిద్యం లాంటిది. ఇది ఒకటిన్నర మీటర్ కంటే కొంచెం ఎక్కువ పొడవులో ఉంటుంది. ఇది ప్రాచీన కాలపు 'కాహళ' లేదా కంచుకొమ్మును పోలి ఉంటుంది.

20కిక్రి:- వైయలిన్ వలె కి ఒక తంత్రీవాద్యం. ఇది గోండులకు ముఖ్యమైన వాద్యం. గోండుల ఉపకులమైన ప్రధాన్ లు దీన్ని వాయిస్తూ గోండి తెగ గాథలను పాడుతారు. దీన్ని ప్రధాన్ ల ధర్మ గురువు హిరాసుక వాద్యంగా పేర్కొంటారు. దీన్ని హీరాబాయి కిక్రి లేదా కింగ్రీ అని కూడా అంటారు. దీన్ని తయారు చేయడం చాలా కష్టమైన పని. చెట్టు కాండాన్ని ఒకటిన్నర జానెడు చతురస్రాకారంలో తొలిచితెచ్చి ఒక 'రెజినేటర్' ను తయారుచేస్తారు. దానిపై మేక చర్మాన్ని అమర్చి దానిలో ఒక వెదురు బొంగును దూర్చుతారు. వెదురు బొంగుకు రెండోవైపు మూడు రంధ్రాలు చేసి శృతికర్రలు అమర్చుతారు. వీటిని పూటీలు అంటారు. పూటీలను 'రెజినేటర్' ను కలుపుతూ తీగలు బిగిస్తారు. వీటిపై ఖోమ్ తో వైయలిన్ వాయించినట్టుగా వాయిస్తారు. భోమ్ కు గజ్జెలు కట్టబడి ఉంటాయి. కిక్రీని వాయించేటప్పుడు గజ్జెలు ఆయా రాగాలు కనుగుణంగా ధ్వనిస్తుంటాయి. ఆ ధ్వనిని అనుకరిస్తూ గానం వెలువడుతుంది. ఆదిమ సంగీత వాద్యమైన ఈ కిక్రి పురాగాథలను వినిపించేటప్పుడు హృదయాలను అద్భుతంగా విస్మయ పరుస్తుంది. గోండులు ఈ కిక్రీవాద్యం భారతదేశంలో ఇతర ప్రాంతాల్లోను కొంత మార్పులతో కనిపిస్తుంది. దీన్ని మణిపూర్ లో 'పేన' అని, 'కెన్న-బాణం' అని ఒరిస్సా లో, రావణహస్త అని రాజస్తాన్ లో, వీణాకుంజ్ అని కేరళలో పిలుస్తారు. కిక్రి గోండ్ జాతి ఆదివాసీలకు అమూల్యమైన వాద్యం. సన్నాయి, పెప్రె అనే సుషిర వాద్యాలు, డక్కీ అనే చర్మవాద్యం కిక్రీకి సహకార వాద్యాలుగా వాయించినప్పుడు ప్రేక్షకులు గొప్ప ఆనందానుభూతిని పొందుతారు. గోండి పూజారులైన ప్రధాన్ లు తమ ఆచారాన్ని పాటిస్తూ క్రతువుల్లో కర్మకాండలలో పెళ్లిళ్లలో ఉత్సవాలలో దీన్ని సంప్రదాయంగా గౌరవానికి ప్రతీకగా వాయిస్తారు. దీన్ని బట్టి గోండుల జీవితాల్లో ఈ వాద్యానికి ఉన్న ప్రత్యేకత తెలుస్తుంది.

117