Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

b). ఆర్థిక వ్యవస్థ:- గోండుల ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేవి వ్యవసాయం పశుపోషణ అనేవి. గోండులు దేశంలోని అన్ని ప్రాంతాలలో మాదిరిగానే అరక పట్టి దున్ని వ్యవసాయం చేస్తారు. వీరి ప్రధాన పంటకాలం దురాడి (ఫిబ్రవరి - మార్చి). ఈ సమయంలో వీరు భూమిని దున్నటం చెత్తను కాల్చడం చేస్తారు. భావేనెల (ఏప్రిల్ -మే). ఈ నెలలో ఎండలు వడగాలులు ఉంటాయి. బుడ్ భావే (జూన్-జులై) నెలలో తొలకరి వర్షాలు ప్రారంభ మవుతాయి. అప్పుడు గ్రామ పెద్దలు సంప్రదాయ పూర్వకంగా విత్తనాలు తొలుత విత్తే రోజును నిర్ణయిస్తారు. ఆరోజు గ్రామ దేవతకు, గ్రామరక్షక దేవతకు కోడిని బలి ఇస్తారు. వ్యవసాయం పనులు, అడవులలోని పనులు సక్రమంగా జరగాలంటే ప్రకృతిశక్తుల సహకారం అవసరమని గోండులు నమ్ముతారు. కనుక ఇలాంటి బలి పూజా విధానాలను ఆచరిస్తారు. ఉదయం ఈ కార్యక్రమం పూర్తిచేసుకొని అల్పాహారం తిని అందరూ పొలానికి పోతారు. యువకులు ధోవతి, అంగీ ధరించి, తలకు తలపాగా చుట్టుకొని, ఎడ్లను అలంకరించి అరక పట్టుకొని బయలుదేరుతారు. స్త్రీలు చక్కటి దుస్తులు ధరించి విత్తనాలు బుట్టలో పోసుకొని వారి వెంట నడుస్తారు. పిల్లలు కేరింతలు కొడుతూ వారిని అనుసరించి నడుస్తారు. అందరూ పొలానికి చేరుకొని విత్తనాలు చల్లే ముందు ధూపం వెలిగించి వ్యవసాయ ఉపకరణాలుపై తిప్పి, తెచ్చిన తీపి పప్పును పొలాల్లో చల్లుతారు. పృథ్వీమాత పూజ ఇలా జరిగిన తర్వాత పురుషులు అరక నడుపుతూ ఉంటే దాని వెంబడి స్త్రీలు విత్తనాలు వేస్తూ నడుస్తారు. ప్రధాన పంట జొన్నలు కాపుకు వచ్చినప్పుడు స్త్రీలు పురుషులు పిల్లలు రాత్రింబవళ్ళు కాపలా కాస్తారు. పంట కోతకు వచ్చిన తర్వాత స్త్రీ పురుషులు కొడవలితో కంకులు కోసి తడికెలపై ఎండబెట్టుకుంటారు. అప్పుడు ధాన్యలక్ష్మిని ప్రార్థిస్తూ కోడిని బలి ఇస్తారు. ముఖ్యమైన కంకులు ఏరి పెట్టి విత్తనాలకు దాచుకుంటారు. ఈ కంకులను “చావుర్ జొన్న అంటారు. ”అకుర పాక్" అంటే ఆగస్టు సెప్టెంబరు నెలల్లో రెండవ పంట (రబీ) వేస్తారు. ఈ పంటకు ఉత్సవాలు, వేడుకలు, పూజలు ఉండవు. గోధుమలు, పత్తి, రకరకాల పప్పు ధాన్యాలను, ఆముదం, నువ్వులు వంటి నూనె గింజలను పండిస్తారు. ఇవే వారికి ఆర్థిక వనరుగా పనికివస్తాయి. గోండులు ఇప్పపూలను, చారపప్పును సేకరణ చేసి వర్తకులకు అమ్ముకుంటారు. భావేనెల అంటే ఏప్రిల్ మే నెలల్లో స్త్రీలు వర్షాకాలానికై ఎండు కట్టెలను సేకరించు కుంటారు. వీరు బృందాలుగా ఏర్పడి నీటి వనరుల దగ్గర చేపలు పట్టుకుంటారు. అంతేగాక వీరు ఇంటికి సమీపంలో మొక్కజొన్న, చిక్కుడు, దోస మొదలైన కూరగాయలు పండించి కుటుంబ ఆర్థిక పరిస్థితికి దోహదపడతారు.

C). న్యాయవ్యవస్థ: గ్రామ నాయకుడు తన అధికారాన్ని గ్రామపంచ్ ల నుండి పొందుతాడు. గ్రామపంచ్ అనేది గ్రామవయో జనుల కూటమి. గోండుల న్యాయ విధానం మొదట గ్రామపంచ్ లతో ప్రారంభమవుతుంది. గ్రామ సమాజం కలుషితం కావడానికి కారణమైన వ్యక్తి లేదా వ్యక్తులు చేసిన పని సందేహాస్పదంగా కనిపిస్తే అది నేరంగా పరిగణించ బడుతుంది. నేరం రుజువైతే గ్రామ బహిష్కరణ మూడు విధాలుగా ఉంటుంది. మొదటి రెండు మాత్రమే పంచ్ లు విధిస్తారు. మూడో బహిష్కరణ కేవలం నేరస్తుని కొన్ని ఉత్సవాల్లో పాల్గొనకుండా నిషేధిస్తారు. ఇది వంశపురోహితుడు మాత్రమే చేస్తాడు. మొదటి తరహా బహిష్కారం" విటాడ్" అంటే ఆ నేరస్తుని సమాజం నుండి బహిష్కరించటమేకాక హుక్కాను కూడా మార్చుకోనీయరు. ఇతడు మళ్ళీ సమాజంలోనికి రావాలంటే శుద్ధీకరణ చేయాలి. రెండవ తరహా బహిష్కరణలో ఆ నేరస్తుడు పూర్తిగా మొత్తానికి వెలివేయబడ తాడు. ఇట్టి బహిష్కరణ సాధారణ గోండి సమాజ సభ్యత్వం నుండి తొలగించడం అవుతుంది. ఇతర గోండు గ్రామసభ్యులతోను సామాజిక సంబంధాలను కూడా లేకుండా చేయడమే అవుతుంది. ఇలా బహిష్కృతుడైనవాడు గోండు సమాజ సభ్యుడిగా చూడబడడు. చిన్నచిన్న నేరాలకు గ్రామ పంచ్ లు జరిమానాలు విధించడం, క్షమాపణలు చెప్పించడం వంటివి చేసి సమస్యలను తొలగిస్తారు.

d). మత విశ్వాసాలు:-గోండుల మత విశ్వాసాలలో హిందూమత ప్రభావంతో కొంత విలక్షణత కూడ కనిపిస్తుంది. విలక్షణ సంస్కృతికి మూలం వారి పురాణాలలో లభిస్తుంది. గోండు జాతి పుట్టుక వారు వంశాలుగా

105