Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10"నోమి నోమి అన్నలాలో తుమ్మీద,
నోవనమ్మ నోమరాట్ల తుమ్మీద,
నావనమ్మ నోమిరల్లో తుమ్మీద,
ఏకవీధి అమ్మలాలో తుమ్మీద,
పెద్దడొల్ల పెద్దమ్మతల్లో తుమ్మీద..

కొండరెడ్ల ఆహారపుటలవాట్లను తెలిపే పాటలు కూడా ఉన్నాయి. గిరిజనుల జీవన విధానంలో ఆటపాటలు లేకుండా పండగలు, పెళ్లి వేడుకలు జరగవు. ప్రతి సందర్భానికి ఆటపాటలు తప్పనిసరిగా ఉంటాయి. వాటిలో సమస్త విషయాలు ప్రకటిత మవుతాయి. ఈ క్రింది పాటలో కొండరెడ్ల ఆహార విధానాలు తెలుస్తున్నాయి.

11 రేల రేల రేల రేలైనా ఆరే,
ఆడవలె పాడవలైనా ఆరే,
వేడికలు చెయ్యావలైనా ఆరే,
కందులు సోళ్ళు పండవలైనా ఆరే,
జోరు జొగ్గడు జొన్నకూడైనా ఆరే,
సండ్రు సప్పిడి సారకలైనా ......

కొండరెడ్ల ప్రధాన ఆహారమైన జొన్నలు, సామలు, సోళ్ళు మొదలైన చిరుధాన్యాలతో పాటు వీరు మాంసం కూడా ఆరగిస్తారని, కల్లు, సారా కూడా తాగుతారని ఈ పాట ద్వారా తెలుస్తుంది.

12కోయిలాలే కోయిలాలే,
కోయిలాల కొమ్మలు చూడు
పావురాల జంటలు చూడు,
అన్నెం పుణ్యం ఎరుగని మన్నెం కొండల్లో,
అమాయకపు జీవులకు అడవి తల్లి నీడల్లే,
ఏలో ఏలో ఎన్నెల్లో ఏలో ఏలో ఎన్నెల్లో,
మంచి కొరకు ప్రాణమిచ్చు ఈ మన్నెంకొండల్లో...”

'కొండరెడ్లు అన్నెం పున్నెం ఎరుగనివారని, అమాయకపు జీవులని, మంచి కొరకు ప్రాణమిచ్చే వారిని, కట్టుబాట్లతో కలిసిమెలిసి ఐకమత్యంగా బతుకుతున్నవారని, అడవితల్లి నీడలో నివసిస్తున్నవారని' పై పాటలోని భావం.

ఇలా కొండరెడ్లు ఎక్కువగా ప్రకృతి ఒడిలో జీవించే నిర్మలమైన మనసు కలిగినవారుగా వారి పాటలను బట్టి తెలుస్తుంది. వీరు ఎక్కువగా చేసే దింసా, కోలాటం నృత్యాల్లోని పాటలు వీరి జీవన విధానాన్ని తెలుపు తున్నాయి. పండగల సందర్భాలలోను పాడే పాటలు ఉత్సాహభరితంగా కనిపిస్తాయి.

98