లొద్ది” గుహలు, రాచకొండ గుట్టలలోని "గుర్రాలగుట్ట, పెద్దపల్లి రామగిరి కోట దగ్గరి "పాండవుల లొంక”, మహబూబ్ నగర్ మన్నెంకొండ దేవాలయం దగ్గరి గుహలు, "దొంగల గట్టు గుట్టలు” మల్లూరు గుట్ట చుట్టూ బృహత్ శిలా సమాధులు, వీణవంక గ్రామం దగ్గర "కల్వలగుట్ట గుహలు”, కడెం నదీ తీర ప్రాంతంలో లభించిన పాతరాతియుగం పురావస్తువులు, బమ్మెర గ్రామంలో “మెన్షిర్”లు (వీరుల స్మారక చిహ్నాలు), ఆ ప్రదేశాలలోని చారిత్రక అంశాలను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
అలాగే తెలుగు సాహిత్యంలో ప్రముఖ కావ్యాలైన మహాభారతం, మొల్ల రామాయణం, నన్నె చోడుని 'కుమారసంభవం', శ్రీనాథుని “హరివంశం”, అనంతామాత్యుని "భోజరాజీయం”, పిల్లలమర్రి పినవీరభద్రకవి "శృంగార శాకుంతలం”, కొరవి గోపరాజు "సింహాసన ద్వాత్రింశిక”, శ్రీ కృష్ణ దేవరాయలు 'ఆముక్త మాల్యద', అల్లసాని “మనుచరిత్ర” ధూర్జటి "శ్రీ కాళహస్తీ మహాత్యం”, అయ్యలరాజు రామభద్రుని "రామాభ్యుదయం”, రఘునాధనాయకుని "వాల్మీకి చరిత్ర” వంటి వాటిలో గిరిజనులకు సంబంధించిన పాత్రలు, సన్నివేశాలు, ప్రస్తావనలను ఈ గ్రంధంలో ఉటంకించడంజరిగింది. దీనివల్ల గిరిజన జీవనానికి సాహిత్య సొబగు, కావ్య గౌరవం, ప్రాచీనత, లిఖిత సాహిత్య ఆధారాలలో గిరిజన ప్రజల పాత్ర వంటివి తెలుసుకునే అవకాశం ఏర్పడ్తుంది. ఇది సాహిత్యంలోని సమగ్రతకే కాక, గిరిజన జీవితంలోని సంపూర్ణతకు అద్దం పడుతుంది.
అంతేగాక, మహాభారతంలో వేర్వేరు చోట్ల ఉపయోగించిన శబర, పుళింద, కిరాత, నిషాద, పార్వతీయులు, అరణ్యవాసులు, పర్వతనివాసులు, వనచరులు, బోయలు, వ్యాధులు, పక్షి విధ్వంసకులు, పక్షి వైరి, లుబ్ధ వంటి పదాలు గిరిజన జాతులను ఉద్దేశించే ప్రస్తావించారని తెలుస్తోంది. ఈ పుస్తకంలో విశదంగా అందించిన ఇలాంటి వివరణలు గిరిజనుల సాహిత్య, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక విస్తృతిని ప్రతిబింబిస్తాయనడంలో సందేహం లేదు.
అలా ఈ పుస్తకం తెలంగాణా గిరిజనులకు సంబంధించిన సంపూర్ణ జీవన చిత్రాన్ని సాద్యమైనంత యధార్థతతో డాక్యుమెంట్ చేసిందని భావిస్తూ, తెలంగాణా గిరిజనుల సాంస్కృతిక వైవిధ్యతను భవిష్యత్ ఆధ్యయనాలకు అందించడంలో సఫలీకృతం అయ్యామని విశ్వసిస్తున్నాము.
ధన్యవాదములతో.,
- రవీంద్ర భారతి,
- హైదరాబాద్.
- ఫిబ్రవరి, 2024
డా॥ మామిడి హరికృష్ణ
VI