Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రోజు లాగానే రెండవరోజు మంగళవారం కూడ పూజారి భార్య తలపై కుండ పెట్టుకొని బయలు దేరుతుంది. ఆమెతో పాటు ఉపవాసం ఉన్న స్త్రీలు కూడ ఊరేగింపుగా ఇల్లిల్లూ తిరుగుతారు. మూడవరోజు బుధవారం గంగాలమ్మను కొండకు చేర్చే రోజు. ఆరోజు కూడ పూజారి భార్య తలపై కుండని ఎత్తుకుంటుంది. ఆమెతో పాటు గ్రామస్తులంతా రేల పాటలు పాడుతూ కోలాటం ఆడుతూ బయలుదేరుతారు. వెళ్లేటప్పుడు వాళ్లు తమతో పసుపు, కుంకుమ పేడ, బొగ్గులు, కాటుక తీసుకొని పోతారు. గుహలో అమ్మవారిని దించిన తర్వాత పూజారి చిన్న కోడి పిల్లను అమ్మవారి చుట్టు తిప్పి దాని మెడ విరిచి అక్కడ పడేస్తాడు. కుండకు నమస్కరించి అందరూ తిరిగి వస్తూ పసుపు కుంకుమ కలిపిన రంగు నీళ్లు, పేడ బొగ్గు కాటుక కలిపిన నీళ్లు ఒకరిపై ఒకరు పోసుకుంటూ వస్తారు. ఇంటికి వచ్చి అందరూ స్నానాలు చేసి గుడి దగ్గరకు పోతారు. మగవాళ్ళు అక్కడున్న చెట్టుకు ఉయ్యాలను కడతారు. మొదట పూజారి ఉయ్యాల ఊగుతాడు. తర్వాత అందరూ ఊగుతారు. ఆ ఉయ్యాల శనివారం వరకు ఉంటుంది. తర్వాత దాన్ని ఊడదీసి ముక్కలు చేసి బాణాలకు కట్టుకొని వేటకు వెళతారు.

e). ఆచార వ్యవహారాలు:-

జననం:- కొండరెడ్డి స్త్రీలు ప్రసవాలను ఇంట్లోనే జరుపుకుంటారు. చెక్క మందులను ఉపయోగించి మంత్రసాని ప్రసవం జరిపిస్తుంది. పురిటి మైల పదకొండు రోజుల వరకు పాటిస్తారు. అంతవరకు బాలింతను ఎవరు తాకరు. పదకొండవ రోజు స్నానానికి ప్రతి ఇంటి నుండి పసుపు, వేడి నీళ్లు తీసుకెళ్లి తల్లి బిడ్డకు స్నానం చేయిస్తారు. పురిటిబిడ్డ మంచం దగ్గర కోడిని కోస్తారు. బాలింత తల్లి గాని అత్తగాని మూడు అన్నం ముద్దలు పట్టుకుని దిష్టి తీస్తుంది. కోడి కాలును, రెండు అడ్డాకులు, చాట, రోకలి విల్లు బిడ్డ చేతుల్లో పెట్టి తీసి కాల్చి వేస్తారు. బాలింతరాలు బిడ్డను ఒడిలో పెట్టుకొని కూర్చుంటుంది. తర్వాత అందరూ కానుకలు ఇచ్చి భోజనాలు చేసి వెళ్లిపోతారు. పురుడు రోజు కానీ లేదా ఆరు నెలల తర్వాత గాని బిడ్డకు పేరు పెట్టుకుంటారు. ఆడపిల్ల అయితే ఐదారు సంవత్సరాల తర్వాత గురు శుక్ర వారాల్లో నిమ్మ ముల్లుతో చెవులు కుడతారు. తర్వాత వారం రోజులకు ముక్కు కుడతారు.

వివాహం:- సాధారణంగా కొండరెడ్లు మేనత్త కూతురును, పెద్దక్క కూతురును పెళ్లి చేసుకునే సంప్రదాయం ఉంది. మేనరికం ఉండి చేసుకోకపోతే మేనమామకు కుంచెడు బియ్యం, కుంచెడు పప్పు, పది రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. పెళ్లికి ముందు ఎదురుకోళ్ళు సంబరం చేస్తారు. ఇది పెళ్లి కొడుకు ఇంటి దగ్గర జరుగుతుంది. కాళ్లకు నీళ్లు, కావడి పానకం తీసుకొని వధువువైపు వాళ్ళు వరుని వైపు వాళ్లకు ఎదురు వెళ్తారు. అబ్బాయి అమ్మాయికి గంధం కుంకుమ రాస్తాడు. ఈ సందర్భంగా పులమడం” అనే కార్యక్రమంలో ఒక కోడి పిల్లలను కోసి బయట విసిరి వేస్తారు.

వరుని వైపు వాళ్ళు పుట్ట మట్టి తెచ్చి పెళ్ళికి అరుగు వేసి దాని నాలుగు వైపులా నాలుగు నేరేడు కొమ్మలు నాటుతారు. ఈ నేరేడు కొమ్మలకు నాలుగు వైపులా కొత్త కుండలు పెడతారు. వీటిని "అవిరేలు” అంటారు. పెళ్లి పందిరిని “నేరేడు కొట్టు" అంటారు. వధూవరులు మేనమామలు పెళ్లి పందిరి చుట్టూ వాళ్ళని ఎత్తుకొని మూడుసార్లు తిప్పుతారు. ఆ సమయంలో వధూవరులు ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటారు. ఈ వేడుకను “బుగ్గ పూత” అంటారు. పెళ్లి పందిరి చుట్టూ నాలుగు లేదా పది వరసల దారం చుడతారు. దాన్ని వరుడు కత్తితో కోస్తాడు. తర్వాత పెళ్లి పందిట్లో వరుని కుడి వైపు వధువును కూర్చుండబెట్టి మధ్యలో పరదా పెట్టి పుస్తెను కట్టిస్తారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత వరుడు వ్యవసాయ పనిముట్లు పట్టుకొని, వధువు “కాతా పెట్టె" (అన్నం కుండ, సామలు, సోళ్ళు ఉండే బుట్ట) పట్టుకొని పెళ్లి పందిరి చుట్టూ మూడుసార్లు తిరుగుతారు. తర్వాత వధూవరులు పీటల మీద కూర్చుంటారు. అప్పుడు వరుడు కోడికి సామలు, జొన్నలు తినిపిస్తాడు. వధువు కోడిని కోసి దాని రక్తంతో బియ్యం తడిపి అక్కడే చల్లుతుంది. కోసిన కోడి మాంసాన్ని వండుకొని వధూవరులు తింటారు.

93