వస్త్రధారణ:-కొండ రెడ్డి స్త్రీలు పూర్వం చీర మాత్రమే కట్టుకునేవారు. ఇప్పుడు రవికలు కూడా ధరిస్తున్నారు. బాలికలు పావడ, రవిక ధరిస్తున్నారు. కొండ రెడ్డి పురుషులు పూర్వం గోచి మాత్రమే ధరించేవారు. ఇప్పుడు ధోవతులు ధరిస్తున్నారు. బాలురు చొక్కా చెడ్డీలను వేసుకుంటున్నారు.
ఆభరణాలు:- కొండరెడ్డి స్త్రీలు చెవి ఆభరణాలు, ముక్కు ఆభరణాలు, కంఠాభరణాలు ధరిస్తారు. కాళ్లకు చేతులకు కడియాలు పెట్టుకుంటారు. వీటిని వెండితో తయారుచేస్తారు స్త్రీపురుషులు ఇద్దరూ కడియాలను పెట్టుకుంటారు. “తాలక” అనేది డైమండ్ ఆకారంలో ఉండేవి. దుద్దులు అనేవి ముద్దలాగా ఉండేవి. కాడలు సన్నని పులల్లాగా ఉండేవి. కమలాలనేవి ఏడు రాళ్ల కమ్మలు. ఇవి స్త్రీలు చెవులకు పెట్టుకునే ఆభరణాలు. “నత్తు” ముక్కుకు ఎడమవైపున ధరించే ఆభరణం. ఇది హంస ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని హంసనత్తు అంటారు. హంసపుల్ల అనేది ముక్కుకు కుడివైపున ధరించే ఆభరణం. దీనిలో ఏడు రాళ్లు ఉంటాయి. మధ్యలో ఎరుపు రంగురాయి చుట్టూ తెలుపురాళ్లు పొదిగిన ఆభరణం బేసరి. ఇది కూడా ముక్కుకు ధరించే ఆభరణం. ముక్కుపుడకను కూడా కొండరెడ్డి స్త్రీలు ఒకవైపున గాని రెండు వైపులా గాని ధరిస్తారు. ఇది నక్షత్రం ఆకారంలో ఉంటుంది. అడ్డ బాసర ముక్కు నుండి పెదవుల వరకు వేలాడే ఆభరణం. దీన్ని ముక్కు దూలానికి తగిలిస్తారు. దీన్ని ఎక్కువగా వృద్ధ స్త్రీలు ధరిస్తారు. కొండరెడ్డి స్త్రీలు వివాహితులు కంఠానికి నల్లపూసల దండలు వేసుకుంటారు. వివాహిత స్త్రీలు కాళ్లకు వెండి మెట్టెలు, చేతులకు మట్టి గాజులు ధరిస్తారు. ఇవన్నీ హిందూ సంప్రదాయానికి అనుగుణంగానే ఉంటాయి.
కొండరెడ్డి స్త్రీలు తమ అలంకరణ లో భాగంగా పచ్చబొట్టులకు ప్రాధాన్యం ఇస్తారు. ముఖం మీద బొట్టుపెట్టుకునే చోట నిలువు బొట్టును, చేతులపై పేర్లను, వివిధ రకాల పువ్వులను, లతలను పచ్చబొట్లుగా వేయించుకుంటారు. కొందరు నడుము మీద కూడా పచ్చబొట్టు పొడిపించుకుంటారు. పచ్చబొట్టు పొడిపించుకుంటే ఒళ్ళు నొప్పులు రావని వీరి నమ్మకం.
b). ఆర్థిక వ్యవస్థ:- కొండరెడ్లు వ్యవసాయం చేసి రకరకాల ధాన్యాలను, కూరగాయలను పండిస్తారు. వాటిలో కొన్ని తమ కోసం దాచుకొని మిగిలిన వాటిని అమ్ముకుంటారు. వారు అడవి నుండి తేనె, చింతపండు, కుంకుడు కాయలు మొదలైనటువంటివాటిని సేకరించి అమ్ముకుంటారు. పసుపు ఆముదాలు మామిడిపండ్లు, జీలుగుసారా అమ్ముకొని తమ అవసరాలకు ధనం సంపాదించు కుంటారు.
C). న్యాయ వ్యవస్థ: కొండ రెడ్డి సామాజిక వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండడానికి వారి కుల పంచాయితీయే కారణం. ప్రతి గ్రామానికి పెద్దకాపు ఉంటాడు. అతనికి సహాయకారిగా చిన్నకాపు ఉంటాడు. ఈ అధికారం వారసత్వ హక్కుగా లభిస్తుంది. పెద్దకాపు పూజారిగా కూడా వ్యవహరిస్తాడు. పెద్దకాపు తమ్ముడు గాని లేదా అతనికి దగ్గర బంధువు గాని చిన్నకాపు లేదా చిన్న పెద్దగా వ్యవహరిస్తాడు. చిన్నకాపు అన్ని విషయాల్లో పెద్దకాపుకు సహకరిస్తాడు. అతడు పెద్దకాపులేని సమయంలో పనులు తానే చక్కబెడతాడు. సమాచారాన్ని గ్రామ పెద్దలకు, ఊరివారందరికీ తెలుపుతాడు. వివాహానికి సంబంధించిన విడాకులు, అక్రమ సంబంధాలు, భూమి తగాదాలు ఇంకా ఇతర నేరాలన్నీ ఈ కుల పంచాయతీ లోని పరిష్కారం అవుతాయి. ఒకే గోత్రానికి సంబంధించిన వారు ప్రేమించుకుంటే దాన్ని తీవ్రనేరంగా పరిగణిస్తారు. దీనికి కుల బహిష్కరణ శిక్ష విధించబడుతుంది. ఇలాంటి సంబంధం వదులుకుంటే పవిత్రీకరణ ద్వారా కుల బహిష్కరణ నుండి తప్పించుకోవచ్చు. ఈ పవిత్ర కార్యానికి సంఘంలోని అందరు పెద్దలకు విందు ఇవ్వాలి. తర్వాత జంగం కులంలోని వ్యక్తి బంగారు ఉంగరాన్ని కాల్చి నాలుక మీద వాత పెడతాడు. ఆ విధంగా నేరస్తుడు కుల బహిష్కరణ నుండి విముక్తుడు అవుతాడు.
90