Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎక్కువగా జొన్నలను పండిస్తారు. వీరి ప్రధాన ఆహారం జొన్నలు. వీరు రాగులను, కందులను, చిక్కుళ్ళను, వడ్లు మొదలైన ధాన్యాలను పండించి వాటిని చక్కగా విలువ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకుంటారు. వీరు పంది మాంసాన్ని తింటారు. కానీ పశువుల మాంసాన్ని తినరు.

కొండరెడ్ల సంస్కృతి

కొండరెడ్లలోని ఐకమత్యమే వారి సంస్కృతిలోని ప్రత్యేకతగా చెప్పవచ్చు. వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పండుగలు ఇతర గిరిజనుల కంటే కొంత భిన్నంగా ఉంటాయి. వారు తమ పూర్వీకుల నుండి వారసత్వంగా లభించిన సంస్కృతిని నేటికీ కాపాడు కుంటున్నారు. వారు పూర్తిగా అడవులపై ఆధారపడి జీవిస్తారు కాబట్టి వారి సంస్కృతిపై, జీవనవిధానంపై ప్రకృతి ప్రభావం బాగా కనిపిస్తుంది.

2(a). జీవనవిధానం:- కొండరెడ్లు తమ ఇళ్లను "లోగిడి" అంటారు. వారు సాధారణంగా తమ ఇంటిని తూర్పు ముఖంగా నిర్మించుకుంటారు. ప్రధాన ద్వారం తూర్పు దిక్కుగానే ఉంటుంది. ఇంటికి తూర్పు పడమరల వైపున రెండు ద్వారాలు ఉంటాయి. ఇంటి కప్పును గడ్డితో కప్పుతారు. కానీ ప్రస్తుతం కొందరు తమ ఇంటిని పెంకుతో కూడా కప్పుకుంటున్నారు. పై కప్పుకి ఆధారంగా నిలిచే కొయ్యను " కొట్టు” అంటారు. ఇంటి నిర్మాణంలో "కొట్టు ముహూర్తం” ప్రధానమైనది. కొట్టు ముహూర్తానికి బుధ గురు శుక్రవారాలు శుభప్రదమైనవిగా భావిస్తారు. తొలి కొట్టును ఈశాన్యం దిక్కులో పెడతారు. తొలి కొట్టు వేసిన తర్వాత ఇంటి కొలతలు ప్రకారం మిగతా కొట్లను ఏర్పాటు చేస్తారు. తర్వాత వెదురు బొంగులతో ఇంటిముందు నీడ కొరకు పందిరి వేసి మొత్తం నిర్మాణాన్ని గడ్డితో కప్పుతారు. ఇంటిచుట్టూ వెదురు కట్టెలతో ప్రహరీ మాదిరిగా నిర్మాణం చేస్తారు. ఇంటిముందు దిష్టి దోషాన్ని నివారించడానికి మూడు నిమ్మకాయలను, మూడు మిరపకాయలను కడతారు. సూర్యాస్తమయానికి ముందే దీపాలు వెలిగిస్తారు. చలికాలంలో ఎండు కట్టెలు కాల్చి “నెగడు” వేస్తారు.

ఆహారం:- కొండరెడ్లు తమ ఆహారం కొరకు సోళ్ళు, సామలు, కొర్రలు గంట్లు, బుడమలు, జొన్నలు మొదలైన వాటిని పండించు కుంటారు. ఈ ధాన్యాలను పిండి చేసి రొట్టెలు, అంబలి చేసుకుని వాడుతారు. జీలుగ అంబలిని కూడా తాగుతారు. జీలుగు చెట్టు కొమ్మలు నరికి బెరడు తీసి మధ్యలో ఉండే బెండును ఎండబెట్టి పిండిగా చేసి అంబలి కాచుకొని తాగుతారు. మామిడి టెంకలను కూడా ఎండబెట్టి పిండి చేసి అంబలి చేసుకుని తాగుతారు. సేమలకూర, వెదురుకొమ్మలకూర, గురుగాకు అడవిలో దొరికే ఇలాంటి ఆకులను కూరగా చేసుకుని రొట్టెలతో తింటారు. కందులు, పెసలు, మినుములు, అలసందలు వేయించి పప్పు చేసుకొని తింటారు. చింతచిగురును పప్పులో వేసుకొని వండుకుంటారు. గుమ్మడి కాయలను ఎక్కువగా వాడుతారు. పనసపొట్టుకూర, సొరకాయకూర వండుకుంటారు. సీరాముల కాయలు తొక్కతీసి పిక్కలను పులుసు పెట్టుకుంటారు. కాయ కూరల్లో చిక్కుడుకాయలకు ప్రత్యేకమైన పండగ చేస్తారు. మొదటి పంటకు పండగ చేసిన తర్వాతనే వారు చిక్కుడు కాయలను కూర చేసుకుని తింటారు. దుంపకూరలను కూడా వారు వాడుతారు. అడవిలో దొరికే వైముదుంప, నారదుంప, పిడుదుంప, చివిడీలు, కంద, మాడుగు మొదలైన దుంప కూరలను తింటారు.

మాంసంకూరల్లో నాటుకోడి, మేక, గొర్రె, పంది, కుందేలు, కణుసు మొదలైనవాటి మాంసం తింటారు. ఇందులో కుందేలు మాంసం ఆడవాళ్లు వండరు తినరు. స్త్రీలు తింటే జబ్బు వస్తుందని వారి నమ్మకం. మగవాళ్ళు మాత్రమే కుందేలు మాంసం తింటారు.

89