పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124 ' తిర్యగ్విద్వన్మహాసభ

[వ్యాఘ్రావధానులుగారును, వరాహభట్లుగారును, బకసోమయాజులు గారును ప్రవేశించుచున్నారు.]

అశ్వ---సభవారేరయ్యా? సభాపతులు మీరుమాత్రమే వచ్చినారు?

వ్యాఘ్రా---వెనుకనుంచి వారూల్వస్తూవున్నారు. మర్కట జ్యోస్యులుగారు పంచాంగం నిమిత్తం వెళ్ళినారు. తక్కినవారూ వారితోనేవస్తారు.

రామ---ఈధర్మసందేహము ఒకసోమయాజులుగారి నడుగుదామా? ఆయన బహుతపశ్శాలి; అనేక యజ్ఞాలుచేసినవారు; ఆయనతో సమానమైన ధ్యానము మరెవరికిలేదు, ఆయన మహాద్విజశ్రేష్టుడు; కవిచక్రవర్తి.

కొంక---మీవాడుగనుక వూరికే పొగడతూవున్నావు. ఆయనాద్విజల శేష్టుడే; నీవూ ద్విజశ్రేష్టుడవే; ఆయన నీకమటెఘనుడు. నీవు చచ్చినవాటిని పీక్కుతింటావుగాని ఆయన బ్రతికివున్నవాటినే గుటుక్కున మెంగేస్తాడు. యజ్ఞాలకేమీ లోపంలేదు. ఆయన తెల్లవారి లేచింది మొదలుకొని నిత్యమూ మీనమేషాలు చేస్తూవుంటాడు. ఆయన ధ్యానమంతా చేపలను యేలాగు పట్టుకుందామా అనేకాని మరొకటికాదు. పక్షిగనుక ఆయనకూ నీవలెనే పక్షపాతం సహజమే.

రామ---వారిద్దరికీ విరోధం, సభవారు కొంకనక్క, దీక్షలమాటలు విశ్వసించకండి.

కొంక---వారిద్దరూ మిత్రులు. సభవారు రామభంధుశాస్త్రిమాట విశ్వచించకూడదు.

వరా---మీరిద్దరూ వూరికేయెందుకు కంఠశోషపడుతారు? సభవారు వస్తూ వున్నారు వూరుకోండి.