పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

11



గాలిగోపురము

ఇది అలిపిరి రస్తాలో అలిపిరివద్దనుండి ఒక్క మైలుదూరమున నున్నది. అలిపిరినుండి గాలిగోపురమునకు మార్గము నిండా ఎక్కుడు. యాత్రికులకు కష్టముగానుండును. ఈ గోపురము చాలాదూరమునకు కనబడును. రాత్రులందు గాలిగోపురము వరకు మార్గమునను, గోపురము పై భాగములోను దేవస్థానము వారు దీపములు వేయించెదరుగాన నా దీపము చాలాదూరము కనబడును.

ఈ గోపురమునుచేరి ఒక్క మఠముగలదు. దీనిని గాలిగోపుర మఠమనియు, వైకుంఠదర్వాజామఠమనియు వాడెదరు. ఇచ్చట కొందఱు ఉత్తర హిందూస్తాన్ సాధువులుగలరు. సదావృత్తిచ్చెదరు. ఈ మఠము తిరుపతిలోనుగలదు. తిరుమలలో నొక కట్టడముగలదు.

సారెపెట్టెలు

భాష్యకార్ల వారి దేవస్థానము దాటినతర్వాత కొన్ని గజములదూరములో పెట్టెలుపేర్చినటుల శిలలుగలవు. ఆ పెట్టెలకు నాలుగుప్రక్కల ఆంజనేయవిగ్రహములుగలవు. శ్రీపద్మావతమ్మ వారు సారె తెచ్చుకొనుచు అక్కడకు రాగా నామె కోపము వచ్చినందున నాపెట్టె లచ్చటనుంచి ఆంజనేయులను కావలిపెట్టి పద్మ సరోవరమునకు వెళ్లినట్టు చెప్పెదరు. కోపమునకు కారణము పలువిధములు జెప్పెదరు. అయితే శ్రీవారికి కావల్సిన వస్తువులు కొన్ని తేలేదని శ్రీవారు నిరాదరణ చేసినందువలన కోపముగల్గెనని చెప్పెదరు. ఇచ్చట శ్రీ అమ్మవారి అడుగు జాడలు కనబడును. ఆ జాడలను మార్గస్తులు పూజించెదరు.