పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0133-05 శుద్ధవసంతం సం: 02-136 అధ్యాత్మ


పల్లవి: పరమాత్ముఁ డొక్కఁడే పరమపావనుఁడు గన
పరిపూర్ణుఁడనెడి యీభావమే చాలు

చ. 1: హేయ మిందే దుపాధేయ మిందేది
బాయిటనే హరి సర్వపరిపూర్ణుఁడు
నేయునెడ గుణభావజీవకల్పనము లివి
రోయఁజూచినఁ దనదు కాయమే రోఁత

చ. 2: జాతి యిందే దంత్యజాతి యిందేది
జాతులన్నిటా నాత్మ సర్వేశుఁడు
ఆతలను అంటుముట్టనెడి భావనలెల్ల
బాఁతిపడి యెఱఁగనోపని వెలితే తనది

చ. 3: తెలివిగలదాఁకాఁ దెగని మఱఁగు లివి
తెలిసినంతటిమీఁదఁ దీరు సంశయము
యిలలోన శ్రీవేంకటేశ్వరుని కరుణచే
వెలసి యీజ్ఞానంబు విడువకు మనసా