పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0133-01 మలహరి సం: 02-132 శరణాగతి

పల్లవి: సర్వోపాయముల జగతి నాకితఁడే
వుర్వీధరుఁడు పురుషోత్తముం డితఁడే

చ. 1: సకలగంగాది తీర్థస్నానఫలము లివి స్వామిపుష్కరణి జలమే నాకు
సకలపుణ్యక్షేత్రావాసయాత్ర లివి సరి వేంకటాచలవిహార మిదియే
సకలవేదాధ్యయనశాస్త్రపాఠంబు లివి శౌరిసంకీర్తనం బిదియే నాకు
సకలకర్మానుష్ఠానముల యితని కిచ్చటఁ జాతుపడి కైంకర్య మిదియే

చ. 2: ఉపవాసతపములివి యితని ప్రసాదంబులొగి భుజింపుటే నాదు దినదినంబు
జపరహస్యోపదేశంబు లితనిపాదజలంబులు శరణనేటి సేవ యొకటే
ఉపమింపఁ బుణ్యపురుషుల దర్శనము నాకు నొగి నిచటి బహువృక్షదర్శనంబు
యెపుడుఁ బుణ్యకథాశ్రవణంబు లిచ్చోటి యెన్నఁగల బహుపక్షికలకలంబు

చ. 3: తలఁపుగల యోగంబులందు శ్రీవైష్ణవులఁ దగులు సంవాససహయోగంబు
వెలయ నిండుమహోత్సవంబులిన్నియు నితనివిభవంబులెసఁగు తిరునాళ్ళు నాకు
చెలఁగి యిటు దేవతాప్రార్థనింతయు నాకు శ్రీవేంకటేశ్వరుని శరణాగతి
అలరు నాసంపదలు యితని పట్టపురాణి అలమేలుమంగ కడకంటిచూపు