పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0131-03 పాడి సం: 02-123 అధ్యాత్మ

పల్లవి: వేఱొక భావనలేల వీనితోఁ బెనఁగనేల
తూఱినందే హరిగూర్చి తుదగంట గాక

చ.1: చూచే కన్నుల నేమిఁ జూడకుండవచ్చునా
       చూచినందెల్లా హరిఁ జూచుట గాక
       వేచిన వీనుల నేమీ వినకుండవచ్చునా
       కాచి యవే హరికథగా వింట గాక

చ.2: కోరేటి చవుల జిహ్వ గోరకుండవచ్చునా
      కోరిన చవుల హరిఁ గూర్చుట గాక
      ఆరీతి బారే మనసు అడఁచఁగవచ్చునా
      ఆరితేరి అన్నిటాను హరిఁ గంట గాక

చ.3: వొడలు మోచిన దేహి వోమకుండవచ్చునా
      వోడలు శ్రీహరిదనే వోముట గాక
      బడినే శ్రీవేంకటేశుఁ బాసివుండవచ్చునా
      యెడయ కందె సుఖియించుట గాక