పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు:0131-02 ముఖారి సం: 02-122 శరణాగతి

పల్లవి:ఏ దుపాయము యే నిన్నుఁ జేరుటకు
      ఆదినంత్యములేని అచ్యుతమూరితివి
      
చ. 1:వెలయ నీగుణములు వినుతించేనంటే
      తెలియ నీవు గుణాతీతుఁడవు
      చెలరేఁగి నిను మతిఁ జింతించేనంటే
      మలసి నీ వచింత్య మహిముఁడవు
      
చ. 2:పొదిగి చేతుల నిన్నుఁ బూజించేనంటే
      కదిసి నీవు విశ్వకాయుఁడవు
      అదన నేమైన సమర్పించేనంటే
      సదరమై అవాప్త సకలకాముఁడవు
      
చ. 3: కన్నుల చేత నిన్నుఁ గనుఁగొనేనంటే
       సన్నిధి దొరక నగోచరుఁడవు
       యిన్నిటాను శ్రీవేంకటేశ నీవు గలవని
       వన్నెల శరణనే వాక్యమే చాలు