పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0307-06 శుద్ధవసంతం సం: 04-042 అంత్యప్రాస

పల్లవి:

విత్తొకటి వెట్టఁగా వేరొకటి మొలచునా
యెత్తి హరి నీవు నను నీడేర్తుగాక

చ. 1:

మోహబాంధవములకు మూలంబు తనువు
వూహాపోహలకు వునికి యీ తనువు
దాహమున కాఁకటికి తగులు యీ తనువు
యీహీ వైరాగ్య మిందెట్టు గలుగు

చ. 2:

పంచేంద్రియములకు పాదు యీ తనువు
చంచలపుటాసలకు జంట యీ తనువు
అంచె దుర్గణములకు నాకరము తనువు
యెంచి చూడ వివేక మిందెట్టు నిలుచు

చ. 3:

యీహలోకసుఖములకు హేతువీ తనువు
బహుపుణ్యపాపాలకు ఫలము యీ తనువు
యిహమునకు శ్రీవేంకటేశ నీదాస్యమున
విహరించెఁ దనువు యిఁక వెఱపేల కలుగు