పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0307-05 దేవగాంధారి సం: 04-041 శరణాగతి

పల్లవి:

ఒహో వొడలుమాని వోపికె గడుమేలు
యిహల నీవుపకారమేమని నుతింతు

చ. 1:

పుట్టినచోటంటినా అది భూతములనెలవు
నెట్టన మూసిన మేను నిఖిల హేయమయము
యిట్టి నా యాతుమలోన హరి యెట్టుంటివి నీవు
అట్టె నీచేఁతలు దలఁచి అరుదయ్యీ నాకు

చ. 2:

మించుల మనసంటిమా అది మిగులఁ జంచలంబు
పంచల నా సంపదలు పాపపుణ్య విధులు
యెంచఁగా యిటువంటి నన్ను యెట్టు ధరియించితి
నించిన నీ చేఁతలు విని నివ్వెరగయ్యీని

చ. 3:

పాయ మిది యంటిమా పంచేంద్రియముల వశము
ఆయము నాకంటిమా అది అయిదుభూతముల మొరఁగు
యీయెడ శ్రీవేంకటేశ యీడా యెట్టేలితి నన్ను
మాయల నీశరణంబిందుకే మనసయ్యీ నాకు