పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0307-04 గుండక్రియ సం: 04-040 వైష్ణవ భక్తి

పల్లవి:

కోటికిఁ బడగయెత్తి కొంకనేల
యీటులేని పదమక్కి యిఁకనేల చింత

చ. 1:

పెట్టినది నొసలను పెద్ద పెద్ద తిరుమణి
కట్టినది మొలఁ జిన్నకౌపీనము
పట్టినది శ్రీహరిపాదపద్మ మూలము
యెట్టయినా మాకు మేలే యిఁకనేల చింత

చ. 2:

చిక్కి నా లోనైనది శ్రీవైష్ణవధర్మము
తొక్కినది భవముల తుదిపదము
యెక్కినది హరిభక్తి యిది పట్టపేనుఁగ
యెక్కువ కెక్కువే కాక యిఁక నేల చింత

చ. 3:

చిత్తములోనిండినది శ్రీపతిరూపము
హత్తినది వైరాగ్య మాత్మధనము
యెత్తలఁజూచిన మాకు నిదివో శ్రీవేంకటేశుఁ-
డెత్తి మముఁ గావఁగాను యిఁక నేల చింత