పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0307-02 లలిత సం: 04-038 నామ సంకీర్తన

పల్లవి:

ఇదియే సులభం బిందరికి
కదియఁగ వసమా కరుణనే కాక

చ. 1:

నగధరుండు పన్నగశయనుడు భూ-
గగనాంతరిక్షగాత్రుడు
అగణితుఁడితని నరసి తెలియఁగాఁ
దగు నా కనెడిది దాస్యమే కాక

చ. 2:

కమలజజనకుఁడు కామునిజనకుఁడు
కమలాసతిపతి ఘనగుణుఁడు
విమలుఁడీహరి వెదకి కానఁగను
అమరునా శరణాగతిఁగాక

చ. 3:

దేవుఁడు త్రిగుణాతీతుఁ డనంతుఁడు
కైవల్యమొఁసగుఘనుఁడు
శ్రీవేంకటపతి జీవాంతరాత్ముఁడు
భావించవసమా భక్తిన కాక