పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0306-04 భైరవి సం: 04-034 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

శరణ మాతనికే సర్వభావాల
యిరవై మమ్ము రక్షించ నీశ్వరుఁడే యెఱుఁగు

చ. 1:

వచ్చిన త్రోవెఱఁగము వడిఁ బూర్వకాలమందు
చొచ్చెటి త్రోవెఱఁగము సోదించి విూఁద
కుచ్చిన కర్మములతో గుదియై వేలుకాడేము
హెచ్చి మా బ్రదుకుఁదోవ యీశ్వరుఁడే యెరుఁగు

చ. 2:

నన్ను నేనే యెఱఁగను నానాచందములను
అన్నిటా నాలోనున్న హరిఁ గానను
కన్నులఁ జూచుచు మంచి కాయములో నున్నవాఁడ
యెన్నఁగ నాజ్ఞానము యీశ్వరుఁడే యెరుఁగు

చ. 3:

మొదలు దెలియను ముంచి కొన దెలియను
చదువుచు నున్నవాఁడ సర్వవేదాలు
హృదయములోనుండి యిటు నన్ను గావఁగ
యిదివో శ్రీవేంకటాద్రి యీశ్వరుఁడే యెఱుఁగు