పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0306-03 దేసాళం సం: 04-033 వైష్ణవ భక్తి

పల్లవి: చదివి బతుకరో సర్వ జనులు మీరు
కదిసి నారాయణాష్టాక్షర మిదియే

చ. 1:

సాదించి మున్ను శుకుఁడు చదివినట్టి చదువు
వేద వ్యాసులు చదివినచ దువు
అది కాలపు వైష్ణవులందరి నోటి చదువు
గాదిలి నారాయణాష్టాక్షర మిదియే

చ. 2:

సతతము మునులెల్ల చదివినట్టి చదువు
వెత దీర బ్రహ్మ చదివినచదువు
జతనమై ప్రహ్లాదుఁడు చదివి నట్టి చదువు
గతిగా నారాయణాష్టాక్షర మిదియే

చ. 3:

చలపట్టి దేవతలు చదివినట్టి చదువు
వెలయ విప్రులు చదివేటి చదువు
పలుమారు శ్రీ వేంకటపతినామమై భువిఁ
గలుగు నారాయణాష్టాక్షర మిదియే