పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0306-02 నాట సం: 04-032 నృసింహ

పల్లవి:

కదిరి నృసింహుఁడు కంభమున వెడలె
విదితముగా సేవించరొ మునులు

చ. 1:

ఫాలలోచనము భయదోగ్రముఖము
జ్వాలామయ కేసరములును
కాల రౌద్ర సంఘటిత దంతములు
హేలాగతి ధరియించుక నిలిచె

చ. 2:

ముడివడు బొమ్మలు ముంచిన వూర్పులు
గడగడ నదరెటి కటములును
నిడుద నాలికెయు నిక్కుఁ గర్ణములు-
నడియాలపు రూపై తా వెలసె

చ. 3:

సకలాయుధములు సహస్ర భుజములు
వికట నఖంబులు వెఁస బూని
వెకలి యగుచు శ్రీ వేంకటేశ్వరుఁడె
ప్రకటపు దుష్టుల భంజించె నిదివో