పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0306-01 భౌళి సం: 04-031 తేరు

పల్లవి:

ఎత్తరే ఆరతులు యియ్యరేకానుకలు
యిత్తల నేఁగివచ్చీని యిందిరానాధుఁడు

చ. 1:

గరుడధ్వజపు తేరు కనకమయపు తేరు
సిరులతో వేదములచేరుల తేరు
సురలు మునులుఁ బట్టి సొంపుతోడఁ దియ్యఁగాను
యిరవుగ నేఁగివచ్చీ నిందిరానాధుఁడు

చ. 2:

జీవకోట్లున్న తేరు శేషుఁడే రూపైన తేరు
వేవేలు సింగారముల వెలయు తేరు
మూవరుస నిత్యులును ముక్తులును గొలువఁగా
యీవల నేఁగివచ్చీ నిందిరానాథుఁడు

చ. 3:

పంచభూతముల తేరు బ్రహ్మాండమైన తేరు
మించిన శ్రీవేంకటాద్రి మీఁదటి తేరు
కొంచక యలమేల్మంగఁ గూడి వచ్చీ నదె తేరు
చరాని మహిమల నిందిరానాథుఁడు