పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       రేకు: 0301-02 దేసాళ౦ సం:04-002 అధ్యాత్మ

పల్లవి
       నాకు నాకే సిగ్గయ్యీని నన్ను జూచుకొంటేను
       చేకొని నీవే మన్నించ జెయ్యెుగ్గేఁగాని

చ. 1:
       సేయరాని పాపములు సేసివచ్చి యేనోర
       నాయెడ నిన్ను వరములడిగేను
       కాయముతో నింద్రియకింకరుఁడనై యేమని
       చేయార నీబంటనని చెప్పుకొనేను

చ. 2:
       వేగిలేచి సంసారవిధులకే వొడిగట్టి
       యేగతిఁ గొసరి నీపై నేఁట వేసేము
       అగడపు బంగారుకాతుమనే నమ్ముకొని
       భోగపుమోక్షము నెట్టు వొందించు మనేము

చ. 3:
       కలుపుట్టుగుబదుకు కాంతలకు వెచ్చపెట్టి
       వలసి నేడెట్టు నీవార మయేము
       నెలవై శ్రీవేంకటేశ నీవ కరుణించితివి
       బలిమిసేసి నీకెట్టు భారము వేసేము