పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0305-02 దేవగాంధారి సం: 04-026 కళ్యాణ కీర్తనలు

పల్లవి:

అమరాంగన లదె యాడేరు
ప్రమదంబున నదె పాడేరు

చ. 1:

గరుడవాహనుఁడు కనకరథముపై
యిరువుగ వీధుల నేఁగీని
సురలును మునులును సొంపుగ మోఁకులు
తెరలిచి తెరలిచి తీసేరు

చ. 2:

యిలధరుఁడదివో యింద్రరథముపై
కెలయుచు దిక్కులు గెలిచీని
బలు శేషాదులు బ్రహ్మశివాదులు
చెలఁగి సేవలటు సేసేరు

చ. 3:

అలమేల్మంగతో నటు శ్రీవేంకట
నిలయుఁ డరదమున నెగడీని
నలుగడ ముక్తులు నారాదాదులును
పొలుపు మిగులఁ గడుఁ బొగడేరు