పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0335-05 సౌరాష్ట్రం సం: 04-206 విష్ణు కీర్తనం

పల్లవి: విడువ విడువ నింక విష్ణుఁడ నీపాదములు
కడఁగి సంసారవార్ధి కడుముంచుకొనిన

చ. 1: పరమాత్మ నీవెందో పరాకైయున్నాను
పరగ నన్నింద్రియాలు పరచినాను
ధరణిపైఁ జెలరేఁగి తనువు వేసరినాను
దురితాలు నలువంకఁ దొడికి తీసినను

చ. 2: పుట్టుగు లిట్టె రానీ భువి లేక మాననీ
వట్టి ముదిమైన రానీ వయసే రానీ
చుట్టుకొన్నబంధములు చూడనీ వీడనీ
నెట్టుకొన్నయంతరాత్మ నీకు నాకుఁ బోదు

చ. 3: యీదేహమే యయిన ఇఁక నొకటైనాను
కాదు గూడదని ముక్తి కడకేఁగినా
శ్రీదేవుఁడవైన శ్రీవేంకటేశ నీకు
సోదించి నీశరణమె చొచ్చితి నే నిఁకను