పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

రాజును ఫజులుల్లా ఖాన్‌ తన నివాసానికి పిలిపించుకుని విప్లవోద్యమం గురించి చర్చిస్తూ ఆ వేదాంత చర్చల చాటున అడవిబిడ్డల మీద అధికారుల జులుం, ఆ సమస్యల పరిష్కార మార్గాలు, ఆ మార్గాల ద్వారా సత్పలితాలు రాబట్టేందుకు రూపొందించాల్సిన పథకాల గురించి ఆలోచనలు చేశారు. ఆ చర్చల పర్యవసానంగా ఏర్పడిన పునాదుల మీదమన్యం విప్లవోద్యమం సాగింది. ఆ ఆలోచనలను ఆచరణలో పెడుతూ అల్లూరికి అడ్డతీగల సమీపంలో 60 ఎకరాల భూమిని ఫజులుల్లా ఖాన్‌ మంజూరు చేయించటమే కాకుండా, ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా పోలీసుల నుండి ఆటంకాలు లేకుండా మన్యంలో స్వేచ్ఛగా సంచరిస్తూ తన కార్యకలాపాలను సాగించే అవకాశాన్ని రాజుకు కల్పించారు.

ఈ విధంగా బ్రిటిష్‌ ఉన్నతాధికారులైన ఆంగ్లేయులకు ఎటువంటి అనుమానం కలుగకుండా రామరాజుకు ఫజులుల్లా అండగా నిలిచారు. ఈ విషయమై పొన్నలూరి రాస్తూ 'కృష్ణదేవి పేటలో అలజడి యారంభమైనపుడే రాజును స్థానభ్రష్టుని జేయక, అతనికి భూములిప్పించి, మన్యములోనే నిల్పిన ఖాన్‌గారి చర్యలు ఈ పితూరికి పూర్తి సహాయమైనటుల తెల్ల ఉద్యోగులు తమ విశ్వాసమును ప్రకటిచిరి' అన్నారు.

మన్యం విప్లవానికి రామరాజు నాయకుడైతే, ఆ నాయకుని రదసారదిగా ఫజులుల్లా ఖాన్‌ను పొన్నలూరి అభివర్ణించారు. అత్యంత ప్రాధాన్యతగల ఈ అంశాన్ని ఆయన మరితంగా వివరిస్తూ 'రామరాజు ప్రవేశించినంతనే, వివిదాంధకారయుతమగు మన్యలోకమున విప్లవ భానుడుదయించి నటులయ్యెను. కాని యా భానుని (రాజు) తీవ్ర గమనమునకు రధ సారధ్యమును వహించవలసిన శ్రీయుత ఫజులుల్లా ఖాను గారు మృత్యుశయ్యపై నున్నారు. ఫజులుల్లా గారు గొప్ప వ్యాధిగ్రస్తులైపోయిరి. పిదప అనతి కాలంలో ఖాను గారు స్వగస్తులైరి' అని ఆనాటి పరిస్థితిని వివరించారు.

ఈ వాఖ్యానాలు, అందిన సమాచారం బట్టి అల్లూరి విప్లవోద్యమం ఆవిర్భావంలో డిపుటి కలక్టరు ఫజులుల్లాఖాన్‌ ఎంతటి గొప్ప పాత్ర నిర్వహించారో తెలుస్తుంది. ఆ కారణంగా 'ఖాన్‌ గారు మరికొంతకాలం జీవించియున్నచో, ఆయన కంఠానికి ఉరిబెట్టి ప్రభుత్వము తన ఆగ్రహమును లోకమునకు ప్రకటించేది' అని పొన్నలూరి అభిప్రాయ పడ్డారు. అల్లూరి సాగించిన పోరాటానికి పరోక్షంగా చేయూతనిచ్చిన ఫజులుల్లా ఖాన్‌కు చరిత్ర సరైన న్యాయం చేయలేదు. ఆయన సాహసాన్ని పొన్నలూరి బయటపెట్టేంత వరకు ఫజులుల్లా పాత్ర ఎవ్వరికీ తెలియదనటం విచారకరం. ఈ విధంగా ఫజులుల్లా ఖాన్‌ చివరి వరకు అల్లూరి సీతారామరాజుకు అన్నివిధాల సహయపడుతూ 1922 లై 27న అంతిమ శ్వాస విడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌