పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

91

37. మౌలానా ముహమ్మద్‌ హసన్‌

(1851-1920)

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఉలేమాలు ఎంత అద్వితీయమైన పాత్ర పోషించారో ఆ తరువాత కూడా జాతీయోద్యమంలో అంత మహత్తర భాగస్వామ్యాన్ని అందించిన ఉలేమాలలో SHAIK-UL-HIND గా ఖ్యాతిగాంచిన మౌలానా ముహమ్మద్‌ హసన్‌ గణనీయులు.

ముహమ్మద్‌ హసన్‌ 1851లో ఉత్తర ప్రదేశ్‌లోని సహరనపూర్‌ జిల్లా బరేల్లి (Bareilly) లో జన్మించారు. తండ్రి మౌలానా జుల్పికర్‌ అలీ. స్వగ్రామంలో ప్రాథమిక విద్య పూర్తిచేసిన మహమ్మద్‌ హసన్‌ దేవ్‌బంద్‌లోని దార్‌-ఉల్‌-ఉలూం ప్రథమ విద్యార్థిగా చేరి తన అసాధారణ ప్రతిభ ద్వారా 1871లో ఆ విద్యాలయంలోనే ఆచార్యులయ్యారు. ఆ తరువాత 1888లో ప్రధానాచార్యునిగా పదోన్నతి లభించగా తన 75 రూపాయల జీతంలో 25 రూపాయలను విద్యాసంస్థ అభివృద్ధి నిధికి అందచేశారు.

బ్రిటిషర్ల బానిసత్వం నుండి మాతృభూమిని విముక్తం చేయాలన్న అంతర్గత లక్ష్యంతో ఏర్పడిన దార్‌-ఉల్‌-ఉలూం మహమ్మద్‌ హసన్‌ నేతృత్వంలో సమర్థులైన విముక్తి పోరాట సైనికులను తయారుచేసే కృషిని ఆరంభించి, పలు ఇతర సంఘాలను, సంస్థలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసింది.

చిరస్మ రణయులు