పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

ముస్లింలను తేడా లేకుండా, విధేయత, సమర్థలను బట్టీ పలువురికి బాధ్యతలను అప్పగించారు. హిందూ-ముస్లిం ఐక్యతావశ్యకతను గ్రహించిన ఆయన ఏ మతస్థుని మనోభావాలకు విఘాతం కలుగకుండా పలు విప్లవాత్మక చర్య లను తీసుకున్నారు. పరాయి పాలకులను పాలద్రోలమని, వారికి ఏమాత్రం సహకరించవద్దని ఇటు స్వదేశీ సైనికులకు, అటు ప్రజలకు బహుదూర్ షా జఫర్‌ తన చారిత్రాత్మక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఆంగ్లేయుల తరిమివేత తరువాత, ఢిల్లీ బయట పలు ప్రాంతాలలో సాగుతున్న తిరుగుబాట్లను గమనించిన బహుదూర్‌ షా జఫర్‌, ఆ యోధులందర్నీ ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు. ఆంగ్లేయులను పూర్తిగా పరాజితులను చేసేందుకు ఈ పోరాటంలో తమతో కలసి రావాల్సిందిగా కోరుతూ పాటియాలా, బల్లభ్‌ఘర్‌, బహదూర్‌ఘర్‌, జైపూరు, ఉదయపూరు, అల్వార్ రాజులకు, ఝుజ్జర్‌ నవాబుకు లేఖలు రాశారు. ఆ లేఖలో, దేశం విముక్తమయ్యాక పాలనాధికారాలను స్వదేశీపాలకులకు అప్పగిస్తానని పేర్కొన్నారు. ఆ క్రమంలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి స్పూర్తి కేంద్రంగా మారిన ఢిల్లీని తమ పట్టునుండి జారీపోనివ్వరాదాని తిరుగుబాటు యోధులు, ఎలాగైనా పునరాక్రమించుకోవాలని ఆంగ్లేయాధికారులు వేసిన ఎత్తుల మధ్య 1857 సెప్టెంబరు 14 వరకు దాదాపు 72 పోరాటాలు సాగాయి.

1857 సెప్టెంబరులో ఢిల్లీ పోరాటం చివరి దశకు చేరుకుంది. ఆంగ్లేయులు తమ బలగాలన్నిటిని కూడదీసుకుని ఢిల్లీ మీద విరుచుకుపడ్డారు. ఆ భీషణ పోరాటంలో తిరుగుబాటు యోధులు ఎర్రకోట రక్షణకు చేసిన యత్నాలు పూర్తిగా విఫలం కావటంతో కంపెనీ సైన్యాలు ఢిల్లీ రక్షణ వలయాన్నిఛేదించుకుని సెప్టెంబరు 14న ఎర్రకోటలోకి చొచ్చుకువచ్చి సెప్టెంబరు 19న ఎర్రకోటను పునరాక్రమించుకున్నాయి. గత్యంతరం లేక చక్రవర్తి జఫర్‌ తన పరివారంతో సెప్టెంబరు 20న హుమాయూన్‌ సమాధి భవనం వద్ద తలదాచుకోగా ఆయనను 21న అరెస్టు చేశారు. అనంతరం విచారణ జరిపి బహదూర్‌ షాను నేరస్థుడిగా ప్రకటించి 1858 డిసెంబరు 4న రంగూన్‌కు పంపారు. ఈ విధంగా భారత దేశంలోని తిరుగుబాటు శక్తుల ఐక్యతకు కేంద్ర బిందువుగా నిలచిన చక్రవర్తి, ప్రదమ స్వాతంత్య్రసంగ్రామం నాయకులు బహదూర్‌షా జఫర్‌ రంగూన్‌ జైలులో మాతృభూమిని తలచుకుంటూ, జఫర్‌ నీ వెంతటి దురదాష్టంతుడివి ! నువ్వెంతగానో ప్రేమించిన మాతృభూమిలో నీ సమాధి కోసం రెండు గజాల చోటుకు కూడానీవు నోచుకోలేదు అని వాపోతూ 1862 నవంబరు 7న కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌