పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

59

21. పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌

(1831- 1861)

ప్రపంచ చరిత్రలోనే మహోజ్వల ఘట్టంగా భాసించిన భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అద్వితీయమైన సాహసాలతో ఆత్మార్పణకు కూడా వెనుదీయని వీర సైనికులలో పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌ ఒకరు.

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ జిల్లా సంభాల్‌ లోని సామాన్య కుటుంబంలో పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌ 1831లో జన్మించారు. ఆయన తండ్రి పఠాన్‌ అబ్దుల్లా ఖాన్‌. చిన్ననాటి నుండే ధైర్యసాహాసాలను ప్రదర్శిస్తూ గ్రామస్తులను ఆకట్టుకున్న సలాబత్‌ సైనికుడిగా ఖోటా రాజ్యంలో ఉద్యోగం చేబట్టారు. ఆయన ఖోటా సైన్యంలోని గోవర్థన్‌ నాయకత్వంలోని పటాలంలో సభ్యులయ్యారు.

1857 మే మాసంలో భారతదేశం అంతా ఎగిసిపడిన తిరుగుబాటు జ్వాలల ప్రభావం ఉత్తరప్రదేశ్‌ ప్రాంతంలో తీవ్రంగా ఉంది. ఆ సమయంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ రాజకీయ ప్రతినిధి మేజర్‌ బుర్టన్‌ (MAJOR BURTON) నివాస గృహం మీద కోట రాజ్యంలోని స్వదేశీ సైనికుల దళం దాడి చేయటం ద్వారా 1857 అక్టోబరు 15న తిరుగుబాటు బావుటాను ఎగురవేసింది. తిరుగుబాటు యోధుల ధాటికి తట్టుకోలేక మేజర్‌ బుర్డన్‌ బ్రతుకు జీవుడా అంటూ ఆయుధాలు, అనుచరు లతో బంగ్లాలో దాక్కున్నాడు.

చిరస్మ రణీయులు