పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

ప్రవర్తనను, వ్యవహార సరళిని గమనించిన ఆయన కొంతకాలం తరువాత ఇండియాకు తిరిగి వస్తూ భవిష్యతును దృషిలో పెట్టుకుని పలు దేశాలను పర్యటించారు. ఈ పర్యటనలో మాల్టా చేరు కున్నప్పడు, ఆంగ్లో-ప్రెంచి సైన్యాలను రష్యా సైన్యాలు మాల్టా వద్ద పరాజయం పాల్జేయడం తెలుసుకున్నారు. ఆ కారణంగా రష్యా సైనికపాటవాన్నిపరిశీలించేందుకు ఆయన తన ప్రయాణం దిశను మార్చుకుని కానిస్టాంటునోపుల్‌ వెళ్ళారు.

ఆ తరువాత ఫ్రాన్స్‌, క్రిమియాలను సందర్శించి ఆయా దేశాల రాజకీయాలను, యుద్ధ ప్రక్రియలను, నాయకుల ఎత్తులు, జిత్తులను అధ్యయనం చేశారు. ఆ దేశాల ప్రజానీకం స్వేచ్ఛా-స్వాతంత్య్రాల పట్ల వ్యక్తంచేసిన అభిప్రాయాలు, ఆకాంక్షలు, ఆ లక్ష్యాల సాధన కోసం వారు సాగించిన పోరాటాలు ఆయనలో దాగి ఉన్న స్వతంత్ర- స్వేచ్చాయుత ఆలోచనలకు మరింతగా పదునుపెట్టాయి. ఈ సందర్భంగా బ్రిటిష్‌ పాలనాధికారానికి చరమగీతం పాడేందుకు తమతో సహకరించే దేశాల అధినేతలతో రహస్య స్నేహ సంబంధాలను కూడా కుదుర్చుకునేందుకు ఆయన ప్రయత్నించారు.

ఇండియా తిరిగి వచ్చాక నానాసాహెబ్‌తో తన ఆలోచనలను పంచుకుని 1857 నాటి కాన్పూరు తిరుగుబాటుకు వ్యూహరచన చేశారు. ఆంగ్లేయ వ్యతిరేక పోరాటాల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ మేరకు స్వదేశీ పాలకులకు, సైనికులకు నానా సాహెబ్‌ పేరిట ఆయన లేఖలు రాశారు. స్వదేశీ పాలకులంతా ఐక్యంగా ఆంగ్లేయుల మీద ఎందుకు ధ్వజమెత్తాలో ఆ లేఖలలో వివరించారు. ప్రజలలో దేశభక్తి భావనలను పెంపొందించేందుకు, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టేందుకు పయామే ఆజాది అను పత్రికను కూడా ఆయన హిందీ, ఉర్దూ భాషల్లో వెలువరించారు.

అజీముల్లా ఖాన్‌ ఆనాటి పోరాటాలలో నానా సాహెబ్‌తో పాటు స్వయంగా తానూ పాల్గొనడమే కాకుండా, బేగం హజరత్‌ మహల్‌, మౌల్వీ అహ్మదుల్లా ఖాన్‌, ఝాన్సీలక్ష్మీ బాయి, మొగల్‌ రాకుమారుడు ఫిరోజ్‌షా, తాంతియా తోపేలకు మేధోపరమైన సేవలందించారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం పరాజయం అంచుకు చేరుకునేసరికి తిరుగుబాటు యోధులైన, నానా, హజరత్‌ మహాల్‌, ఫిరోజ్‌ షా తదితరులతోపాటుగా నేపాల్‌ అడవుల్లోకి నిష్క్రమించారు.

ప్రమాదాకర ప్రతికూల పరిస్థితులలో కూడా ఆంగేయులకు వ్యతిరేకంగా తుదకంటా పోరాడేందుకు అవసరమైన బలగాలను, ఆర్థిక సాధన సంపత్తిని సమకూర్చుకునే ప్రయత్నంలో అష్ట కష్టాలు పడుతూ, నేపాల్‌ లోని భుట్ వాల్‌ (Bhutwal) ప్రాంతంలో అజీముల్లా ఖాన్‌ 1859 అక్టోబరు మాసంలో కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌