పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

ప్రజలను ఉద్యమదిశగా ప్రేరేపిస్తూ ముందుకు సాగారు. ఆయన ఉద్యమం ఫరాజీ ఉద్యమంగా, ఆయన అనుచరులు ఫరాజీలుగా చరిత్రకెక్కారు.

ఫరాజీ ఉద్యామాన్ని ఉదృతం చేసేందుకు షరియతుల్లా గావించిన పర్యటనలలో గ్రామీణులు, ప్రదానంగా రైతులు, కుల వృతులను అనుసరిసున్న కుటుంబాలు పడుతున్న వెతలకు ఆంగ్లేయ పాలకవర్గాలు, వారి తొత్తులైన జమీందారులు, మహాజనులు, అధికారులు ప్రధాన కారణమని షరియతుల్లా గ్రహించారు. ఆ వర్గాల పీడన నుండి ప్రజలను తద్వారా తమ గడ్డను విముక్తం చేసేందుకు ఆయన సిద్దపడ్డారు . ఆ ప్రయత్నంలో షరియతుల్లా సాధించిన విజయాల వలన ఫరాజీ ఉద్యమం బాగా విస్తరించి భారీ అనుచర వర్గం ఏర్పడింది. ఆ అనుచరులతో ఆయన ప్రజల పక్షంగా పలు పోరాటాలు సాగించి ఆంగ్లేయుల మీద, స్వదేశీ జమీందారులు, ప్లాంటర్ల మీద విజయాలు సాధించారు.

ఆంగ్లేయ ప్లాంటర్లు, జమీందారులు, మహాజనుల దోపిఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటుకు షరియతుల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపుకు స్పందించిన ఫరాజీలు ఎక్కడ అరాచకం, అవినీతి, అన్యాయం ఉంటే అక్కడల్లా ప్రత్యక్షమయ్యారు. ప్రజాకంటకుల ఆటకట్టించి ప్రజలకు అభిమానపాత్రులయ్యారు. అవాంఛనీయ శక్తులకు అండగా నిలుస్తున్నఆంగ్లేయ పాలకవర్గాల అణిచివేత వికృతరూపం ధరించే కొద్ది ప్రజలు మతం, కులం, వృతులకు అతీతంగా షరియతుల్లాకు చేరు వయ్యారు. ఆంగ్లేయుల పెత్తనం, జమీందారుల దోపిడి, ప్లాంటర్ల కిరాతక చర్యల నుండి తమను కాపాడేందుకు తరలి వచ్చిన రక్షకుడిగా షరీయతుల్లాను, ఆయన సహచరులను అభిమానించి గౌరవించారు.

ఉద్యమబాటన ప్రజలకు మార్గదర్శకత్వం వహిస్తూ, పాలకవర్గాల చట్టపరమైన ఉచ్చులలో చిక్కుకోకుండా హాజీ షరియతుల్లా జాగ్రత్త పడినందున పోలీసులు, చట్టాలు, కోర్టులు ఆయన దారి చేరలేక పోయాయి. అరాచకాన్ని ఎదుర్కోవటం మాత్రమే కాకుండా ప్రజలలో స్వేచ్ఛాకాంక్షను, స్వతంత్ర భావాలను ఉద్దీపింపచేయడంలో షరియతుల్లా ప్రబోధాలు, ఆయన నిర్మించిన ఫరాజీ ఉద్యమం ఎంతగానో ఉపయోగపడింది.

అరశతాబ్దికి పెగా ఉధృతంగా సాగి, మరో అర్దశతాబ్ది పాటు సమకాలీన సమాజాన్ని ప్రభావితం చేసిన హజీ షరియతుల్లా సాహసోపేతమైన చర్యలు స్వాతంత్య్రోద్యమంలోని సాయుధా పోరాట యోధులకు ప్రేరణగా నిలిచాయి. ఆది నుండి అంతం వరకు ప్రజల పక్షం వహించి పరాయి పాలకులకు, స్వదేశీ దోపిడిదారులకు వ్యతిరేకంగా బలమైన ఉద్యామాన్ని నిర్మించిన ఫరాజీ ఉద్యమ నిర్మాత హాజీ షరియతుల్లా 1840లో కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌