పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

20 ఏండ్ల షేక్‌ మౌలా గుర్తుండిపోయే సాహసోపేతమైన పాత్ర నిర్వహించారు.

నైజాం సంస్థానంలో భాగమైన పరిఠాల ప్రాంతంలో భారత జాతీయ కాంగ్రెస్‌ పతాకాన్ని ఎగుర వేయడం రాజ ద్రోహం. అది భయంకర నేరం. జాతీయ పతాకాన్ని ఎగురవేస్తే మూడు సంవత్సరాల జైలు శిక్షను పాలకులు అమలు చేస్తున్నారు. పరిఠాల వీరులు జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని సంకల్పించి, నిజాం విధించే శిక్షలను పోలీసుల దాష్టికాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ మీమాంసలో పడ్డారు. ఆ సమయంలో షేక్‌ మౌలా సాహెబ్‌ ముందుకు వచ్చి నిర్బయంగా పరిఠాల గ్రామ కచ్చేరి మీద జాతీయ పతాకమైన మువ్వన్నెల జెండాను ఎగురవేసి స్వాతంత్య్రసమరయోధులు తరుచుగా పాడే దూర్‌ హఠో దునియా వాలో పాటను పాడారని రచయిత 2002 ఏప్రిల్‌ 21న చేసిన ఇంటర్యూలో మాదిరాజు దేవరాజు వెల్లడించారు. ఆ పతాకావిష్కరణతో పరిఠాల రిపబ్లిక్‌ సర్వసత్తాక స్వతంత్ర పాలన ప్రారంభమై 18 నెలలపాటు సాగింది.

పరిఠాల రిపబ్లిక్‌ ఏర్పాటు, పతాకావిష్కరణ విషయం తెలుసుకున్న నైజాం నవాబు జాగీర్దార్‌ పరిఠాల మీద దాడిచేశాడు. జాగీర్దార్‌ దృష్టిలో భయంకర నేరం చేసిన మౌలాకు మతపెద్దల నుండి తాఖీదులు వచ్చాయి, మత పంచాయితి పెట్టి మౌలాకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. మౌలా కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణకు గురిచేశారు. ఈ దాష్టీకాలకు, అవమానాలకు మౌలా ఏమాత్రం చలించలేదు. ఆయన మీద ఎంతటి ఒత్తిడిలు వచ్చినా లొంగకుండా పరిఠాల రిపబ్లిక్‌ కార్యక్రమాలలో తన సహచరుడు, పరిఠాల రిపబ్లిక్‌ అద్యక్షులు మాదిరాజు దేవరాజుతో కలసి నడిచారు.ఈ విషయంలో మౌలా మతంగాని, ఆయన మత మనోభావాలు గాని పరిఠాల రిపబ్లిక్‌ సహచరుల నుండి మౌలా సాహెబ్‌ను వేరుచేయలేకపోయాయి.

చివరకు పరిాల రిపబ్లిక్‌ వ్యవహారం మహాత్మాగాంధి దృష్టికి వెళ్లింది. ఆయన ఈ వ్యవహారాన్నిచూడల్సిందిగా సర్దార్‌ పటేల్‌ను కోరారు. ఈలోగా 1948 సెప్టెంబర్‌లో నైజాం సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావటంతో పరిఠాల రిపబ్లిక్‌ కూడ ఇండియన్‌ యూనియన్‌లో భాగమైపోయింది. పరిఠాల రిపబ్లిక్క్‌ యోధుల ఆకాంక్ష నెరవేరింది. అంతటితో షేక్‌ మౌలా సాహసం సుఖాంతమైంది.

ఈ నాటికి కూడా షేక్‌ మౌలా సాహెబ్‌ ఆనాటిసంఘటనలు గుర్తు తెచ్చుకుంటూ తన కష్టం మీద కుటుంబాన్ని పోషించుకుంటూ పేదరికం పొత్తిళ్ళలో బ్రతుకుతున్నారు. పరిఠాల రిపబ్లిక్‌ వీరోచిత పోరాటం విశేషాలను సవివరంగా తెలుపుతూ దూర్‌ హో దునియా వాలో పాటను మళ్ళీ మళ్ళీ ఉద్వేగభరితంగా విన్పిస్తూ ఆనందిస్తున్నారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌