పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

217

100. షేక్‌ మౌలా సాహెబ్‌

(1927-)

భారత స్వాతంత్య్రసంగ్రామ చరిత్రలో సంచలనాత్మక ఘట్టమైన 'పరిఠాల రిపబ్లిక్‌' ప్రకటన సందర్భంగా పరిఠాల రిపబ్లిక్‌ జెండాను తొలిసారిగా వినువీధుల్లో ఎగురవేసి పరిఠాల రిపబ్లిక్‌ పతాక వీరుడుగా ఖ్యాతిగాంచిన యోధులు షేక్‌ మౌలా సాహెబ్‌.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత కృష్ణాజిల్లా కంచిచకర్ల మండలంలో 'వజ్రాలదిన్నె' గా పేర్గాంచిన పరిఠాల గ్రామంలో షేక్‌ మీరాసాహెబ్‌, మొహమ్మద్‌బీ దంపతులకు 1927లో మౌలా సాహెబ్‌ జన్మించారు. గ్రామంలోని పాఠశాలలో ఫోర్తు ఫారం వరకు చదువుకున్న ఆయన చదువు మానేసి కట్టెలు కొడుతూ కుటుంబానికి ఆధారమయ్యారు. తెలుగు, ఉర్దూ భాషలు తెలిసిన మౌలా స్వతంత్ర ఆలోచనలు గల బాల్యమిత్రుల సహచర్యంలో ఆనాడు సాగుతున్న స్వాతంత్య్ర సంగ్రామం పట్ల ఆసక్తి చూపారు.

అది 1947 సంవత్సరం. భారతదేశమంతా స్వేచ్ఛా పవనాలు వీస్తున్నా నైజాం నవాబు పాలన వలన పరిఠాల ఖానత్‌ తాలూకా స్వేచ్చాగాలులు పీల్చలేని పరిస్థితి. స్వతంత్ర భావాలు గల పరిఠాల ప్రజలు అస్వతంత్రులుగా ఉండలేకపోయారు. మాకొద్దు తెల్ల దొరతనం స్థానంలో మాకొద్దు నిజాం దొరతనం అంటూ నినదిస్తూ పరిఠాల ఖానత్‌లోని ఏడు గ్రామాలలోని ప్రజలంతా ఏకమై మౌలా సాహెబ్‌ మిత్రులు మాదిరాజు దేవరాజు నాయకత్వంలో స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఆ మహత్తర సంఘటనలో

చిరస్మరణీయులు